కర్నూలు జిల్లాలో రాజకీయ నేపథ్యం ఉండి... 5 సార్లు పాణ్యం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఒకరిది. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉండి... రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం మరొకరిది. వారే...కాటసాని రాంభూపాల్ రెడ్డి... గౌరు చరితరెడ్డి. నేతలిద్దరూ... ఈసారి వైకాపా నుంచి టికెట్ తమకేనని ధీమాతో ఉన్నారు. ఈ పరిస్థితిలో.. టికెట్ దక్కనివారు ఏం చేస్తారన్నది చర్చనీయాంశమైంది.
వైకాపా టికెట్ ఎవరికిచ్చేనో.. కర్నూలు జిల్లాలో పాణ్యం నియోజకవర్గం ఒకటి. కల్లూరు, ఓర్వకల్లు, పాణ్యం, గడివేముల మండలాలు ఈ అసెంబ్లీ స్థానం పరిధిలో ఉన్నాయి. ఇక్కడ వైకాపా తరఫున ఆశావహులు ఎక్కువగా ఉన్న కారణంగా... ఎవరికి అవకాశం ఇవ్వాలన్న విషయంపై అధిష్ఠానంలో సందిగ్ధం నెలకొంది. కాంగ్రెస్ క్రియాశీలక నేత గౌరు వెంకటరెడ్డి సతీమణి గౌరు చరిత... 2004లో నందికొట్కూరు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2014లో వైకాపా తరఫున పాణ్యం నుంచి ఎన్నికయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కావడం రాజకీయ అనుభవం సహా ప్రజల మద్దతు ఉందని... వైకాపా తరఫున పాణ్యం స్థానాన్ని ఆమె ఆశిస్తున్నారు.
రాజకీయ నేపథ్యం ఉన్న కాటసాని రాంభూపాల్ రెడ్డి...1985లో మొదటిసారి పాణ్యం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 1989, 1994, 2004, 2009లోనూ గెలిచారు. 2014లో కాంగ్రెస్ వీడి...స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి... గౌరు చరిత చేతిలో ఓడిపోయారు. తర్వాత భారతీయ జనతాపార్టీలో చేరారు. మారిన పరిస్థితుల దృష్ట్యా వైకాపాలోకి వచ్చారు. స్పష్టమైన హామీతోనే ఆయన పార్టీ మారారని జోరుగా ప్రచారం సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గెలుపొందాలన్న లక్ష్యంతో... నియోజకవర్గంలో ఆయన విస్తృతంగా పర్యటిస్తున్నారు.
గౌరు వెంకటరెడ్డి కుటుంబానికి వైఎస్‌తో ఎంతో అనుబంధం ఉంది. అలాంటిది... గౌరు చరితను కాదని కాటసానికి టిక్కెట్ ఇస్తే... సిట్టింగ్ ఎమ్మెల్యే పరిస్థితేంటన్నది చర్చనీయాంశమైంది. వైకాపా మెుండి చేయి చూపిస్తే... గౌరు కుటుంబం సైకిల్ ఎక్కే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.