ఈ ఏడాది పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. జిల్లాలో 45 వేల ఎకరాల్లో ఉల్లి పంటను సాగు చేశారు. పంట చేతికి వస్తున్న సమయంలో... వరుణుడు ఉగ్రరూపం దాల్చాడు. కుండపోత వర్షాలు కురవటంతో... పంట తీవ్రంగా దెబ్బతింది. ఫలితంగా... దిగుబడులు గణనీయంగా తగ్గాయి. అప్పటికే బాగా పెట్టుబడులు పెట్టిన రైతులు పంట నష్టపోవటంతో లబోదిబోమంటున్నారు
తడిసిమోపడవుతున్న పెట్టుబడులు
ఉల్లిపంటకు పెట్టుబడులు ఎక్కువగానే అవుతాయి. ఎకరానికి 50 నుంచి 70 వేల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. మంచి దిగుబడులు వస్తే... ఎకరానికి సుమారు వంద క్వింటాళ్ల వరకు పంట వస్తుంది. వర్షాల కారణంగా... ఎకరానికి 50 క్వింటాళ్లు సైతం రావటం లేదు. మరోవైపు ఉల్లిగడ్డల్లో నాణ్యత లోపించటం, తేమ శాతం ఎక్కువగా ఉండటంతో మంచి ధరలు రావటం లేదు. దీనికి తోడు కోత కూలీలు, రవాణా ఖర్చులు తడిచి మోపెడవుతున్నాయి. బహిరంగ మార్కెట్లో కిలో ఉల్లి వంద రూపాయలు పలుకుతున్నా... తమకు మాత్రం కిలోకు 30 రూపాయలు కూడా రావటం లేదని రైతులు వాపోతున్నారు.