కర్నూలు నగరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు 25 లక్షల రూపాయలను దానం చేశారు ఓ పూర్వ విద్యార్థి. నిడ్జూరు గ్రామానికి చెందిన కే.రవీంద్రారెడ్డి... కళాశాలలో విద్యనభ్యసించారు. విద్యార్థులకు కొత్త భవనం అవసరమున్నందున పూర్వ విద్యార్థులు అందరూ కలిసి ఆర్థిక సాయం అందించారు. ఈ క్రమంలో రవీంద్ర ఒక్కరే 25 లక్షల రూపాయలను అందజేశారు. నూతన భవన నిర్మాణ భూమిపూజకు జిల్లా కలెక్టర్ సత్యనారాయణ హాజరయ్యారు. చదువుకున్న పాఠశాల అభివృద్దికి పూర్వ విద్యార్థులు తమ వంతు సహాయం చేయడం చాలా మంచి నిర్ణయమని కలెక్టర్ అన్నారు. భారీ మొత్తాన్ని కళాశాల అభివృద్ధికి దానం చేసినందుకు రవీంద్రా రెడ్డిని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థుల బృందం హాజరైంది.