శరన్నవరాత్రి ఉత్సవాలు కర్నూలులో భక్తి శ్రద్ధలతో చేసుకుంటున్నారు. నగరంలోని దేవాలయల్లో దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. చిన్న అమ్మవారి శాలలో గాయత్రీ దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. కరోనా వ్యాప్తి కారణంగా దేవాలయాలకు భక్తులు తక్కువ సంఖ్యలో వస్తున్నారు. ఎక్కువ శాతం మహిళలు ఇంటి వద్దనే ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో శరన్నవరాత్రి సందర్భంగా మంచాలమ్మకు పీఠాధిపతి శ్రీసుభుదేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.
విశాఖ జిల్లా నర్సీపట్నంలోని దుర్గా మల్లేశ్వర ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను స్థానిక ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా దుర్గాదేవి ఆలయంలో ఆయన ప్రారంభ పూజలు నిర్వహించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా నవరాత్రి ఉత్సవాలను ఆర్భాటం లేకుండా నిర్వహించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడాలని.. ఆలయ నిర్వాహకులను ఆదేశించారు.