కర్నూలు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదల ధాటికి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అధికారులతో జిల్లా కలెక్టర్ వీరపాండియన్ సమీక్ష నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని... పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని దిశానిర్దేశం చేశారు.
నంద్యాలలో కురుస్తున్న వర్షాలకు కాలనీలు జలమయమయ్యాయి. కుందూ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. సమీపంలోని రాణి, మహారాణి ధియేటర్ ప్రాంతం, జీఎమ్, కరీం వీధులతోపాటు హరిజనవాడలోని పలు ఇళ్లలోకి వరద నీరు చేరింది. నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి... ఈ ప్రాంతాలను పరిశీలించారు. ఆదుకోవడానికి చర్యలు తీసుకుంటామన్నారు.
రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు మహానంది మండలంలో పాలేరు వాగు ఉద్ధృతి దాల్చింది. వ్యవసాయ కళాశాల, ఉద్యాన పరిశోధనా స్థానం, పశుపరిశోధనా స్థానం, గాజులపల్లి ఆర్.ఎస్. గ్రామంలోని చెంచుకాలనీలోకి వరద నీరు చేరింది.