రాజధానిని ఫ్రీ జోన్‌గా ప్రకటించాలి : ఎంపీ టీజీ వెంకటేష్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా రాయలసీమను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని భాజపా రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ అభిప్రాయపడ్డారు. కర్నూలులో జరిగిన రాయలసీమ హక్కుల ఐక్య వేదిక సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాయలసీమ హక్కుల కోసం తన పోరాటం ఆగదని తెలిపారు. అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం భారీగా ఖర్చు చేశారన్న ఆయన... రాజధానిని యథావిథిగా కొనసాగించాలన్నారు. రాజధానిని ఫ్రీజోన్(ఆర్థికమండలి)గా ప్రకటించి అన్ని ప్రాంతాల వారికీ సమాన హక్కులు కేటాయించాలన్నారు. రాయలసీమ హక్కుల కోసం గత ప్రభుత్వాన్ని కోరినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కర్నూలు జిల్లాలోని గుండ్రేవుల, సిద్ధేశ్వరం, వేదవతి ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నారు. ముఖ్యమంత్రి జగన్ తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న నేతగా రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కోరారు.