బండరాళ్లకు జీవం పోయడంలో ఆరితేరిన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ గుంప్రామాన్ దిన్నెకు చెందిన శిల్పకారుల పరిస్థితి దయనీయంగా మారింది. తాత ముత్తాతల కాలం నుంచి శిల్ప వృత్తిలో కొనసాగుతున్న కళాకారులు పట్టణ ప్రాంతంలో ఆదరణ బాగుంటుందనే ఉద్దేశంతో 1950లో ఆళ్లగడ్డలో శిల్పశాల ఏర్పాటు చేసుకున్నారు. 80వ దశకం నుంచి శిల్పులకు భారీగా డిమాండ్ పెరిగింది. గుంప్రామాన్ దిన్నెకు చెందిన చాలా మంది ఈ వృత్తిలోనే కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆళ్లగడ్డలో సుమారు 100 శిల్పశాలలు ఉండగా వాటిలో 500 మంది విగ్రహాలు తయారు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు.
మొదట్లో శిల్పలు దేవతామూర్తుల విగ్రహాలు మాత్రమే తయారు చేసేవారు. అవసరాలకు అనుగుణంగా రాజకీయ నాయకులు, సంఘ సంస్కర్తలు, గృహాలంకరణ, ఉద్యానవనాల కోసం విగ్రహాలు చెక్కడం ప్రారంభించారు. అమెరికా వెళ్లి 3 నెలలు కష్టపడి వేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించి వచ్చారంటే వీరి నైపుణ్యం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఒక్కో శిల్పాల తయారీ కేంద్రం నుంచి సరాసరిన 50 లక్షల రూపాయల వ్యాపారం జరిగేది.