పాసు పుస్తకం ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించటంతో కర్నూలు కలెక్టరేట్‌లో ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. రైతు కుటుంబసభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొలిమిగుండ్ల మండలం బెలూం గ్రామానికి చెందిన ఆదెన్నకు అవుకు మండలం సంఘపట్నంలో 2 ఎకరాల 88 సెంట్ల వ్యవసాయ భూమి ఉంది.
ఈ పొలానికి పాసు పుస్తకం కోసం ఆదెన్న దరఖాస్తు చేసుకున్నాడు. అన్ని అధారాలు సమర్పించినప్పటికీ పాసు పుస్తకం రాకపోవటంతో అతను కలత చెందాడు. ఈ క్రమంలో సోమవారం కర్నూలు కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్ వద్ద ఆత్మహత్యకు యత్నించాడు. రైతును హుటాహుటిన పోలీసులు కర్నూలు సర్వజన వైద్యశాలకు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడు.