Village meeting on podu lands: తెలంగాణ రాష్ట్రంలో పోడు భూముల దరఖాస్తుల పరిశీలన క్షేత్రస్థాయి సర్వేలను, నెలాఖరులోగా పూర్తి చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ మేరకు చర్యలు చేపట్టింది. వందశాతం పరిశీలన పూర్తైన గ్రామాల్లో నేటి నుంచి గ్రామసభలు నిర్వహించనుంది. పోడుపై వచ్చిన దరఖాస్తుల్లో, ఇప్పటికే 70 శాతం వరకు పరిశీలన పూర్తికావడంతో గ్రామసభల్లో వాటిపై చర్చించి.. అర్హుల జాబితాలను రూపొందించనున్నారు.
గ్రామసభల తీర్మానాల కాపీలను.. డివిజన్, జిల్లాస్థాయి కమిటీలు ఆమోదించిన తర్వాత అర్హులైన పోడు రైతులకు వచ్చేనెలలో పట్టాలు పంపిణీ చేయాలని భావిస్తోంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో.. గిరిజన, అటవీ, రెవెన్యూ అధికారులతో కూడిన అదనపు బృందాలను నియమించి, పరిశీలన వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్లను సర్కారు ఆదేశించింది.
రాష్ట్రంలోని ఏజెన్సీ గ్రామాల్లో గిరిజన రైతులు సాగు చేసుకుంటున్న, పోడు భూములపై హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం 2021 నవంబరు 8 నుంచి దరఖాస్తులు స్వీకరించింది. రాష్ట్రంలో 2,450 గిరిజన గ్రామాల పరిధిలో పోడు సమస్యలున్నట్లు గుర్తించింది. ఆయా గ్రామాల కమిటీలు నవంబర్‌లో దరఖాస్తుల స్వీకరణ పూర్తిచేశాయి.
అటవీ హక్కుల చట్టం-2005 ప్రకారం, దాదాపు 5-6 లక్షల ఎకరాల విస్తీర్ణంపై హక్కులకు దరఖాస్తులు వస్తాయని ప్రభుత్వం భావించగా, దాదాపు13.18 లక్షల ఎకరాల విస్తీర్ణంపై 4 లక్షల 14 వేల దరఖాస్తులొచ్చాయి. వాటి కంప్యూటరీకరణ పూర్తిచేసి, డూప్లికేషన్ దరఖాస్తులను గిరిజన సంక్షేమ శాఖ తొలగించింది. అర్హమైన దరఖాస్తులు మూడున్నరల లక్షల వరకు ఉన్నట్లు సమాచారం.