విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. భారీ యంత్రాలు, క్రేన్‌లు, డ్రిల్లింగ్ యంత్రాలతో పనులు జోరందుకున్నాయి. ఇప్పటికే పిల్లర్ల నిర్మాణం ప్రారంభమైంది. అక్టోబరులోనే మట్టి నమూనాల పరీక్షలు చేసి.. నవంబరు ప్రారంభం నుంచి పూర్తి స్థాయిలో పనులు ప్రారంభించారు. రెండోవైపు సర్వీసు రోడ్డును పూర్తిగా మూసివేశారు. 2022 మే నాటికి రెండో వంతెన పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జాతీయ రహదారుల ఇంచార్జి పీడీ శ్రీనివాస్ వెల్లడించారు. ఎలాంటి భూసేకరణ లేకుండా పైవంతెన నిర్మాణం చేపడుతున్నారు.
గత ప్రభుత్వం నిర్ణయించిన వంతెన ఆకృతుల ప్రకారం 2 వంతెనలు నిర్మించాల్సి వచ్చింది. బెంజి సర్కిల్ పైవంతెన రెండో పార్టు కూడా మొదటి వంతెన తరహలోనే ఉన్నప్పటికీ దూరం కొంత మేరకు తగ్గనుంది. అప్రోచ్ రహదారులు ఇరువైపులా కలిపి 350 మీటర్లు మాత్రమే ఉండగా.. మొదటి వంతెనకు అప్రోచ్ రహదారి 880 మీటర్లు ఉంది. రహదారితో కలిపి మొదటి వంతెన దూరం 2.3 కిలోమీటర్లు కాగా రెండో పార్టు దూరం 1.78 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఇందులో.. పైవంతెన 1438 మీటర్లు ఉంటుంది. ఇతర ఆకృతుల్లో ఎలాంటి మార్పు లేదని జాతీయ రహదారుల సంస్థ అధికారులు తెలిపారు.