తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌ను మరింత అందమైన నగరంగా మార్చేందుకు బల్దియా కార్యాచరణ రూపొందించింది. ఇప్పటికే డంప్ యార్డుల వద్ద గార్డెన్లు, మొక్కలు పెడుతూ వచ్చిన జీహెచ్ఎంసీ... ఈసారి జంక్షన్లను అందంగా అలంకరించాలని నిర్ణయించింది. ఖైరతాబాద్ ప్రధాన కూడలిలోని పైవంతెన వద్ద పొడవైన వర్టికల్ గార్డెన్ ఏర్పాటు చేస్తోంది. గార్డెన్ వెనక భాగంలో జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య వాహనాల పార్కింగ్ ఉండడం.. ఈ మార్గంలో వెళ్లేవారు దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. స్వచ్ఛత పంచాలన్న ఆలోచనతో ఖైరతాబాద్ జోనల్ అధికారులు... వర్టికల్ గార్డెన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జీహెచ్ఎంసీకి చెందిన పలు ప్రదేశాల్లో వర్టికల్ గార్డెన్లను నిర్వహిస్తున్న గ్రీన్‌లైఫ్ సంస్థకు ఈ ప్రాజెక్టును అప్పగించారు.
వర్టికల్ గార్డెన్...
అందంతో పాటు ఆహ్లాదం, ప్రాణవాయువు పంచేలా వర్టికల్ గార్డెన్‌ని 2,600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో బ్లాకు 7 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు చొప్పున మొత్తం ఏడు బ్లాకులతో గార్డెన్ సిద్ధవుతోంది. ఈ ఫ్రేమ్ వర్క్‌తో పాటు వంతెన గ్రిల్స్ భాగంలోనూ మరో ఫ్రేమ్‌ను ఆయా బ్లాక్‌లకు అనుసంధానిస్తూ ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి బ్లాక్‌లోనూ 600 మొక్కలకు అవసరమైన కుండీలు సిద్ధం కానున్నాయి. సుమారు 10 రకాల మొక్కలను... మొత్తం అన్ని బ్లాకులు కలిపి 4,200 మొక్కలు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి ప్రస్తుతం ప్యానల్ పనులు కొనసాగుతున్నాయి.