ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టాలన్న సజ్జల రామకృష్ణారెడ్డి... ప్రభుత్వ సలహాదారుగా రాజీనామా చేయాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. వైకాపా అధికార ప్రతినిధిగా చేరాలని ఆయన హితవు పలికారు. ప్రభుత్వ సలహాదారుగా నెలకు లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటూ ప్రతిపక్ష నేతపై కేసులు పెట్టమనటం నేరమని విమర్శించారు. గత రెండేళ్లలో సజ్జల వేలాది అక్రమ కేసులు పెట్టించారని... ఇప్పుడు ముసుగుతీసి బహిరంగంగా అక్రమ కేసులు పెట్టాలని ప్రకటన చేశారని దుయ్యబట్టారు.
కరోనా నియంత్రణ చర్యలు పట్టించుకోకుండా కమీషన్లు వచ్చే స్కీముల కోసం ఆరాటపడుతున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాల్ని అణచివేసే కుట్రలకై సమయాన్ని వృథా చేస్తుండటం వల్లే .. రాష్ట్రంలో వేలాది మంది కరోనాతో చనిపోతున్నారని మండిపడ్డారు. వ్యాక్సిన్ సరఫరాను జనాభా ప్రాతిపదికన కేంద్రం నియంత్రిస్తుంటే… 6.5 కోట్లు జనాభా ఉన్న గుజరాత్ లో 1.38 కోట్ల వ్యాక్సిన్లు ఎలా వేశారని ప్రశ్నించారు. 5.30 కోట్ల జనాభా ఉన్న ఏపీ… కేవలం 73 లక్షల వ్యాక్సిన్లకే ఎందుకు పరిమితమైందని నిలదీశారు.