Krishna district UTF 'Sankalpa Deeksha' UPDATES: రాష్ట్ర ప్రభుత్వం సీపీఎస్‌ను వెంటనే రద్దు చేసి.. దాని స్థానంలో పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) ఈ నెల 3, 4, 5 తేదీల్లో కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిన్న అవుటపల్లిలో 'సంకల్ప దీక్ష'ను చేపట్టారు.
ఈ క్రమంలో యూటీఎఫ్ నాయకులకు గురువారం రాత్రే పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీక్షకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా దీక్షకు వెళ్తే.. చట్టపరంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అయినా కూడా సీపీఎస్‌ను తక్షణమే రద్దు చేయాలన్న డిమాండుతో యూటీఎఫ్ నాయకులు సంకల్ప దీక్షను ప్రారంభించారు. దీంతో దీక్షకు బయలుదేరినా ఉద్యోగ, ఉపాధ్యాయులను ఆయా జిల్లాల పోలీసులు గృహ నిర్బంధాలు చేయడం ప్రారంభించారు.
దీక్షకు బయల్దేరిన సంఘం నాయకులలో.. తాహెర్‌వలి, శ్రీనివాసులు, ఆనంద్, ఆజంబాషా, డి.శ్రీనివాసులు, ఖాజాపీర్, ఖాజా, వెంకటరమణనాయక్, సుబ్బారెడ్డిలకు ఎస్సై ఇసాక్ నోటీసులు అందజేశారు. దీక్షకు బయలుదేరినా వెంటనే వారిని గృహ నిర్బందం చేశారు. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండాలని పలు హెచ్చరికలు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా దీక్షకు వెళ్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం సంఘం జిల్లా కార్యదర్శి తాహెర్‌వలి మాట్లాడుతూ.. నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరన్నారు. ముఖ్యమంత్రి ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటే ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు.