కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవస్థానం ఆధ్వర్యంలో లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన మండపాలు, షెడ్లు దశాబ్ద కాలంగా నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. అధికారులు దృష్టి సారించి వాటిని వినియోగంలోకి తీసుకువస్తే ఆలయానికి ఆదాయంతో పాటు, భక్తులకు వసతి సదుపాయం కలుగుతుంది.
ఏడెకరాల్లో..
తిరుపతమ్మ దేవస్థానానికి మున్నేరు పక్కనే విలువైన ఏడు ఎకరాల మామిడి తోట ఉంది. గతంలో నిరుపయోగంగా ఉండేది. ఐదెకరాల్లో 2007లో మామిడి మొక్కలు నాటించారు. ప్రస్తుతం అవి ఏపుగా పెరిగి ఫలసాయాన్ని ఇస్తున్నాయి. 2019లో రూ .10 లక్షల వ్యయంతో భక్తుల వసతి కోసం షెడ్ నిర్మాణం చేసి వినియోగంలోకి తీసుకురాకుండానే వదిలేశారు. దానికి ఎదురుగా ఉన్న మరో రెండు ఎకరాల భూమిలో 2011లో రూ. 10 లక్షల వ్యయంతో ఆడిటోరియం నిర్మించి విడిచిపెట్టారు. అధికారులపై రాజకీయ ఒత్తిడి తీసుకువచ్చి ఆ రెండు నిర్మాణాలు చేపట్టిన అప్పటి పాలకవర్గాలు... వాటిని భక్తులకు చేరువ చేయడంలో విఫలం చెందాయి. అదే తోటల పక్కన ఉన్న ప్రైవేటు గార్డెన్లలో సాధారణ మౌలిక సదుపాయాలు కల్పించి భక్తులకు అద్దెకు ఇస్తున్నారు.