ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Polavaram project delayed : 'పోలవరం'లో ప్రణాళికా లోపం.. ఆలస్యానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణం : కేంద్రం - Polavaram

Delay in construction of Polavaram project : రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికా లోపం, సమన్వయ లేమితోనే పోలవరం ఆలస్యమైందని... ఐఐటీహెచ్ నివేదించినట్లు కేంద్రం స్పష్టం చేసింది. ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యానికి 14 కారణాలను గుర్తించినట్లు వెల్లడించింది. పోలవరం ఆలస్యానికి కారణాలేమిటన్న స.హ. దరఖాస్తుకు.. కేంద్ర జలశక్తి శాఖ సమాధానం ఇచ్చింది.

Etv Bharat
Etv Bharat

By

Published : Jun 7, 2023, 7:09 AM IST

ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం

Delay in construction of Polavaram project : పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యానికి ఏపీ ప్రభుత్వ వైఖరే కారణమని ఐఐటీ హైదరాబాద్‌ అధ్యయనంలో తేలిందని కేంద్ర జలశక్తి శాఖ వెల్లడించింది. ప్రాజెక్టు నిర్మాణంలో ఆలస్యానికి కారణాలపై సమాచార హక్కు కార్యకర్త ఇనగంటి రవికుమార్‌ స.హ.చట్టం కింద అడిగిన ప్రశ్నలకు ఈ వివరాలు అందించింది. పోలవరం ప్రాజెక్టుపై థర్డ్‌ పార్టీ మదింపు కోసం కేంద్ర జలశక్తి శాఖహైదరాబాద్‌ ఐఐటీని నియమించగా.. 2021 నవంబర్‌లో ఆ సంస్థ ఇచ్చిన నివేదికలో ప్రాజెక్టు జాప్యానికి 14 కారణాలను విశ్లేషించినట్లు తెలిపింది. 2022 ఏప్రిల్‌ 29నాటి పీపీఏ కమిటీ నివేదిక ప్రకారం... హెడ్‌వర్క్స్, ప్రధాన కాల్వలు, భూసేకరణ, సహాయ, పునరావాస పనులు 2024 మార్చి నాటికి, పంపిణీ కాల్వలు 2024 చివరినాటికి పూర్తి కావొచ్చని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు అథారిటీకి సమర్పించిన బిల్లుల వివరాలుతమ వద్ద అందుబాటులో లేవని కేంద్ర జలశక్తిశాఖ తెలిపింది. 2023 మార్చి 31నాటికి 14వేల 418.39 కోట్లు రీయింబర్స్‌ చేయాలని సిఫార్సు చేశామని... అంతకుమించి పెండింగ్‌ బిల్లులేమీ లేవని వెల్లడించింది.

కేంద్ర జలమండలిలోని సాంకేతిక సలహా కమిటీ 2017-18 నాటి ధరల ప్రకారం 55వేల 548 కోట్ల సవరించిన అంచనాలకు ఆమోదముద్ర వేసిందని... ఐతే 2010-11 నాటి ధరలతో రూపొందించిన సవరించిన అంచనాలతో పోలిస్తే 2017-18నాటి ధరలతో రూపొందించిన అంచనాల్లో 20శాతానికి మించి తేడా ఉన్నట్లు పేర్కొంది. దీంతో 2016 ఆగస్టు 5న ఆర్థిక శాఖ జారీచేసిన ఆఫీస్‌ మెమోరాండంలోని నిబంధనల ప్రకారం సవరించిన అంచనాలు ఖరారు చేయడానికి... జలవనరుల శాఖ సంయుక్త కార్యదర్శి, ఆర్థిక సలహాదారు ఆధ్వర్యంలో రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీని ఏర్పాటు చేసినట్లు వివరించింది. ఈ కమిటీ 2020 మార్చిలో ఇచ్చిన నివేదికలో ప్రాజెక్టు నిర్మాణానికి 2013-14 ధరల ప్రకారం 29వేల 27.95 కోట్లు, 2017-18నాటి ధరల ప్రకారం 47వేల 725.74 కోట్లు అవుతుందని అంచనా వేసిందని తెలిపింది.

ఐఐటీ హైదరాబాద్‌ 2021లో ఇచ్చిన నివేదికలో కీలకమైన 14 అంశాలను పేర్కొంది. నిర్మాణ షెడ్యూలుతో పోలిస్తే స్పిల్‌ వే, కాఫర్‌ డ్యాం, కుడివైపు అనుసంధాన పనులు తొలుత ఆలస్యమైనా... ఇప్పుడు పూర్తి కావొస్తున్నాయని నివేదికలో పేర్కొంది. మిగిలిన పనుల్లో ఈసీఆర్ఎఫ్ డ్యామ్‌ గ్యాప్స్‌-1, 2, ఎడమ అనుసంధానాలు, ఎడమ ప్రధాన కాల్వ, ఉపకాల్వల నిర్మాణంలో జాప్యం జరుగుతోందని చెప్పింది. 2022 ఏప్రిల్‌ కల్లా ప్రాజెక్టు పూర్తిచేయాలన్నతాజా ఆమోదిత లక్ష్యాన్ని చేరుకోవడం అసాధ్యమని, అధికారుల సూచనలను గుత్తేదారు సంస్థ పట్టించుకోకపోవడం కూడా ఇందుకు కారణమని ఐఐటీహెచ్ నివేదించింది. ప్రాజెక్టు నిర్మాణ గడువులను ఏపీ జలవనరుల శాఖ తరచూ మార్చడం... కొవిడ్‌ మహమ్మారి, దాని సంబంధ పరిస్థితులను నివేదికలో పేర్కొంది. ఏపీ జలవనరుల శాఖ నిర్మాణ సంస్థలను మార్పు, భూసేకరణ, సహాయ, పునరావాస కార్యకలాపాల్లో నెమ్మదించడాన్ని ఎత్తి చూపింది.

నిర్మాణ సంస్థకు వ్యూహాత్మక ప్రణాళిక లోపించిందన్న ఐఐటీహెచ్ ప్రాజెక్టు నిర్మాణంతో సంబంధమున్న అనుబంధ సంస్థలు లేదా వ్యవస్థల మధ్య సమన్వయ లేమిని పొందుపరిచింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సూచనలు, డిజైన్లకు అనుమతులు పొందడంలో జాప్యంతో పాటు జలవనరుల శాఖ ఆమోదించిన ఒరిజినల్‌ - ప్రీఅప్రూవ్డ్‌ డీపీఆర్​లోని డిజైన్‌లో మార్పులు చేయడాన్ని పేర్కొంది. ఆర్అండ్ఆర్ అమలులో ఆటోమేషన్‌ లేకపోవడం, డాక్యుమెంటేషన్‌ సమస్యలతో నిర్వాసితులకు సకాలంలో పరిహారం అందక... ఆర్ అండ్ ఆర్ పనుల్లో జాప్యం జరిగినట్లు వెల్లడించింది. ఇటీవల ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల్లో జలవనరుల శాఖ 30శాతం లోపు మాత్రమే ఖర్చు చేయడం... భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ ప్రక్రియ 2013నాటి భూసేకరణ, సహాయ పునరావాస చట్టం ప్రకారమే చేస్తున్నప్పటికీ.. అమలులో వేగం లోపించిందని 2021 నివేదికలో స్పష్టం చేసింది. కాంట్రాక్టర్లను తరచూ మార్చడం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యానికి కారణమైందని... కాంట్రాక్ట్‌ మేనేజ్‌మెంట్‌ దృష్టి సారించాలని సూచించింది. ఆమోదిత డీపీఆర్​ నుంచి పక్కకు మళ్లడం, ప్రాధాన్యాలను మార్చడంతో పాటు ఒక ఏజెన్సీని రద్దు లేదా ప్రీక్లోజర్‌ చేశాక, కొత్త ఏజెన్సీకి పనులు అప్పగించకపోవడాన్ని నివేదికలో ఎత్తిచూపింది.

ABOUT THE AUTHOR

...view details