రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఈ ఉదయం 10న్నర గంటలకు ప్రారంభించేలా అధికారులు అన్నిఏర్పాట్లూ చేశారు.ప్రధాని మోదీ...... వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం విజయవాడ జీజీహెచ్ లోని.. లబ్ధిదారులతో ప్రధాని మోదీ దిల్లీ నుంచి వర్చువల్ విధానంలో మాట్లాడే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి జగన్..... విజయవాడ సర్వజనాస్పత్రికి ఉదయం 11 గంటల 25 నిమిషాలకు చేరుకుని........ టీకా పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. టీకా వేయించుకునే వారితో.....సీఎం మాట్లాడే అవకాశం ఉంది. రాష్ట్రంలో తొలిటీకాను జీజీహెచ్ పారిశుద్ధ్య విభాగంలో పనిచేసే మహిళకు ఇవ్వాలని నిర్ణయించారు.
తొలి విడత వ్యాక్సినేషన్‌లో భాగంగా రాష్ట్రానికి 4.96 లక్షల డోసుల టీకా వచ్చింది. ఇందులో 20 వేల డోసుల కొవాగ్జిన్ ఉండగా, మిగిలినవి కొవిషీల్డ్ డోసులు. తొలివిడతలో కొవిషీల్డ్‌నే లబ్ధిదారులకు వేయనున్నారు. తొలిరోజు ఒక్కోచోట వంద మంది చొప్పున... 332 కేంద్రాల్లో 33 వేల 200 మందికి టీకాలు ఇవ్వనున్నారు. ప్రాధాన్యక్రమంలో వీరి సెల్‌ఫోన్లకు శుక్రవారం నుంచి సంక్షిప్త సమాచారం వెళ్లడం మొదలైంది. దీని ప్రకారం వారు టీకా వేయించుకోవాలి. గుర్తింపు కార్డు చూపిస్తేనే పంపిణీ కేంద్రానికి అనుమతిస్తారు. కనీసం 15 రోజుల పాటు ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. టీకా వేయించుకున్న వారికి తిరిగి 28 రోజుల తర్వాత మలివిడత వ్యాక్సిన్ ఇస్తామని ఆరోగ్య,కుటుంబసంక్షేమ శాఖ కమిషనర్ తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 3 లక్షల 87 వేల 983 మంది ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ వేయనున్నారు. టీకా వేసేందుకు 2 వేల 324 మందిని ప్రభుత్వం నియమించింది.
అటు వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. గుంటూరు జిల్లాలో 31 కేంద్రాల్లో కరోనా టీకా పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారు. తొలి రోజున 2వేల 466 మందికి టీకా ఇవ్వనున్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని సంయుక్త కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. విశాఖ జిల్లాలో 32 కేంద్రాలలో టీకా వేసేందుకు సర్వం సిద్ధం చేసినట్లు డీఎంహెచ్ఓ సూర్యనారాయణ తెలిపారు. వాక్సినేషన్ తర్వాత ఎలాంటి సమస్యలెదురైనా వెంటనే చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. కర్నూలు జిల్లాలో మొదటి విడత వ్యాక్సినేషన్ కోసం 147 కేంద్రాలు సిద్ధమయ్యాయి. నేడు 27 కేంద్రాల్లో టీకాలు ఇవ్వనున్నారు..