కరోనా పరిస్థితుల కారణంగా 2019-20లో తీసుకున్న ట్యూషన్ ఫీజునే 2020-21 విద్యా సంవత్సరంలోనూ వసూలు చేయాలని 2020 ఏప్రిల్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో46ను జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరానికి(2021-22) కూడా ఫీజు పెంచరాదని, కేవలం ట్యూషన్ రుసుమును, అదీ నెలవారీగా మాత్రమే తీసుకోవాలని గత నెల 28న ప్రభుత్వం జీవో 75 జారీ చేసింది. అంటే 2019-20లో ఫీజునే ఈసారీ వసూలు చేయాలి.
ఆ జీవో ప్రకారం ట్యూషన్ ఫీజంటే అన్నీ చెల్లించాల్సిందే
కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాలని జీవో75లో సర్కారు పేర్కొంది. ట్యూషన్ ఫీజు అంటే ఏమిటన్నది ఆ జీవోలో లేదు. ట్యూషన్ రుసుం అన్న దానికి 2009 ఆగస్టు 6వ తేదీన జారీ చేసిన జీవో 91లో అప్పటి ఉమ్మడి ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఆ ప్రకారం ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది వేతనాలు, పదవీ విరమణ ప్రయోజనాలు, నిర్వహణ ఖర్చు, బడిలోని మౌలిక వసతులు, సౌకర్యాలతో పాటు స్పెషల్ ఫీజు, డెవలప్‌మెంట్ రుసుం తదితరాలు కలిపి అని వివరణ ఇచ్చింది. చదువుకు ప్రత్యక్ష సంబంధం లేని ఏదైనా కార్యకలాపాలు ట్యూషన్ ఫీజు కిందకు రావు. అలాంటివి విద్యార్థుల ఇష్టానికి వదిలేయాలి. ఆ ప్రకారం ట్యూషన్ ఫీజులోకి రానివి రవాణా(ట్రాన్స్‌పోర్ట్), అల్పాహారం, మధ్యాహ్నభోజనం, టూర్లు, స్విమ్మింగ్ లాంటివి. పాఠశాల యాజమాన్యం ఏర్పాటు చేసిన బస్సు/వ్యాన్‌లో రావాలా? సొంతంగా చేరుకోవాలా? అన్నది విద్యార్థి ఇష్టం. అలాగే ఆహారం, స్విమ్మింగ్, టూర్లు, పిక్నిక్‌లు లాంటివి ఐచ్ఛికం అయినందున అవి మాత్రం ట్యూషన్ ఫీజు కిందకు రావు. గత ఏడాది జీవో 46 ఇచ్చినప్పుడు ట్యూషన్ ఫీజంటే ఇప్పుడు ఆన్‌లైన్ తరగతుల వల్ల గ్రంథాలయాలు, కంప్యూటర్ ల్యాబ్‌లు, క్రీడా మైదానం లాంటివి ఉపయోగించుకోవడం లేదు కాబట్టి వాటికి కూడా ఫీజు తీసుకోరాదని పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఒక దశలో ట్యూషన్ ఫీజంటే కొత్త అర్థాన్ని రూపొందించాలని కూడా చెప్పుకొచ్చారు. ఇప్పుడు జీవో91 ఉంది కదాని ప్రశ్నిస్తుండటం గమనార్హం.
జీవో 75 పాటించకుంటే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామని, ఇతర బోర్డుల పరిధిలోని పాఠశాలలకు ఇచ్చిన నిరభ్యంతర ధ్రువపత్రాలను(ఎన్‌ఓసీ) వెనక్కి తీసుకుంటామని, పాఠశాలల యాజమాన్యాలపై చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామన్న ప్రభుత్వం ఏ పాఠశాలలో ఏ తరగతికి ఎంత ట్యూషన్ ఫీజు అన్నది ఆయా పాఠశాలల వెబ్‌సైట్లో ఉంచాలని మాత్రం హెచ్చరించకపోవడం గమనార్హం. జీవో ఇచ్చి అయిదు రోజులు గడిచినా...విద్యా సంవత్సరం మొదలైనా ఆ దిశగా ఇప్పటివరకు కనీసం చర్చించలేదని తెలిసింది.