పోలీసులు ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని కేసులో ఇరికించాలనుకున్నాక ఎన్ని తప్పుడు సాక్ష్యాలైనా సృష్టించగలరని మాజీ మంత్రి నక్కాఆనంద్‌బాబు విమర్శించారు. చనిపోయిన భాస్కరరావు కూడా ఒక రౌడీ షీటర్ అని పేర్కొన్నారు. కొల్లు రవీంద్ర అజాత శత్రువన్న ఆయన... సౌమ్యుడైన నేతను అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. రాజకీయ ప్రత్యర్థులపై అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపటం తగదని హితవుపలికారు. బలహీన వర్గాలు, దళితులు జగన్ ప్రభుత్వంలో జీవించే హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని నక్కాఆనంద్‌బాబు ఆవేదన వ్యక్తం చేశారు.
బీసీలను లక్ష్యంగా చేసుకున్నారు : చినరాజప్ప
నిందితులతో బలవంతంగా పోలీసులే కొల్లు రవీంద్ర పేరు చెప్పించారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. కేసు పెట్టాలనుకున్నప్పుడు... ఎలాగైనా పోలీసులు పెట్టగలరన్నారు. బీసీల మద్దతు తెలుగుదేశానికి ఎక్కువగా ఉన్నందుకే వారిని సీఎం లక్ష్యంగా చేసుకుంటున్నారని మండిపడ్డారు. సభాపతి కూడా రాజ్యాంగంపై విమర్శలు చేయడం దుర్మార్గమన్నారు. ముఖ్యమంత్రి వైఖరికి తగ్గట్లే కార్యకర్తలు, పార్టీ నేతలు ఉన్నారని చినరాజప్ప విమర్శించారు.