వైకాపా ప్రభుత్వం నిరాధార ఆరోపణలతో తెలుగుదేశం పార్టీపై బురదజల్లే కార్యక్రమాలు చేస్తోందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు. అవినీతిపరుల కేసుల సంగతి తేల్చమని సుప్రీంకోర్టులో పిల్ దాఖలవటంతో సీఎం జగన్, ఆయన బృందంలో వణుకు మొదలైందన్నారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్నవారు.. వారు అడక్కుండానే అన్ని బిల్లులకు మద్దతిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారంలో ఉన్నవారు పార్లమెంటులో ప్రజల సమస్యలను ప్రస్తావించకుండా ధర్నాలు చేయడమేంటని ప్రశ్నించారు. డిక్లరేషన్ ఇవ్వనంటూ జగన్ హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించడం సరికాదన్నారు. సంతకం పెట్టడం ఇష్టం లేకపోతే అసలు తిరుమల వెళ్లడం ఎందుకంటూ నిలదీశారు.