జగన్ ఏడాది పాలనలో కేకు సంబరాలు తప్ప నియోజకవర్గాల్లో అభివృద్ధి శూన్యమని తెలుగుదేశం ఆరోపించింది. మసి పూసి మారేడుకాయ అని చెప్పడంలో ముఖ్యమంత్రి జగన్ ఆరితేరారని ఆక్షేపించింది. కియా వైఎస్ లేఖతో రాష్ట్రానికి వచ్చింది అని చెప్పుకోవడం జగన్ పబ్లిసిటీ పిచ్చికి పరాకాష్ఠ అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. ఏడాదిలో పాలన చేతగాక పాత వాటికి రంగులు వేసి సరిపెట్టారని ఆక్షేపించారు.
గోల్డ్ మెడల్ సాధించి డాక్టర్ అయిన ఒక దళిత బిడ్డపై వైకాపా గుండాలు దాష్టీకం చేశారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ దిశ చట్టం దిశ తప్పిందా? అని సీఎం జగన్ను ప్రశ్నించారు. డాక్టర్ అనితా రాణిని వేధించడం దారుణమన్న ఆయన... నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను లోకేశ్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు.