ఓ మహిళా వీఆర్ఓ, ఆమె తల్లి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన గంపలగూడెం పోలీసు స్టేషన్ కానిస్టేబుల్ రామకృష్ణను.. కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ సస్పెండ్ చేశారు. ప్రజలతో మర్యాదగా ప్రవర్తించకపోతే చర్యలు తప్పవని మిగతా పోలీసులను హెచ్చరించారు.
గంపలగూడెం ఇసుక చెక్ పోస్ట్ వద్ద రామృష్ణ విధులు నిర్వహిస్తున్నాడు. అయితే కొంత కాలంగా అధికారుల అనుమతి లేకుండా విధులకు గైర్హాజరయ్యాడు. విధుల పట్ల అలసత్వం వహించడమే కాక, ఆ ప్రాంత మహిళ వీఆర్ఓ పట్ల, ఆమె తల్లి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని బాధితులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.
ఇవేకాక అతనిపై గతంలో కూడా పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యం లో ఫిర్యాదుపై విచారణ జరిపి నివేదిక పంపాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సంఘటనపై అధికారులు పూర్తి విచారణ జరిపి ఎస్పీకి నివేదిక పంపారు. అతనిపై వచ్చిన ఆరోపణలు నిజమని నిర్ధారణ చేసుకుని రామకృష్ణను సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు.
'సీసీ కెమెరాలు ఎర్పాటు చేసుకోవాలి'
పెరుగుతున్న జనసాంద్రత, నేరాల వృద్ధి రేటును దృష్టిలో ఉంచుకొని వ్యాపార , వాణిజ్య ప్రాంతాలతో పాటు వారి నివాస ప్రాంతంలో కూడా ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కృష్ణా జిల్లా ప్రజానీకానికి ఎస్పీ సిద్ధార్థ కౌశల్ విజ్ఞప్తి చేశారు. గుడివాడలో పర్యటించిన ఆయన వన్ టౌన్, టూ టౌన్, రూరల్, సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
అనంతరం సిబ్బందితో వ్యక్తిగతంగా మాట్లాడిన ఆయన.. వారి పనితీరుతో పాటు వ్యక్తిగత సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నేర నియంత్రణకు కీలకంగా మారిన సీసీ కెమెరాలను జిల్లాలోని ప్రజానీకం, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, ఎర్పాటు చేసుకోవాలన్నారు. ఒక సీసీ కెమెరాను ఏర్పాటు చేస్తే, అక్కడ పది మంది పోలీసులు ఉన్నట్లు భావించాలని ఆయన అన్నారు. రోజురోజుకీ పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల నివారణ, నేర పరిశోధనలో కీలక పాత్ర వహిస్తాయని తెలిపారు.
ఇదీ చదవండి:Jogi Ramesh: 'దేవినేని ఇంటికి చంద్రబాబు వెళ్లటం శోచనీయం'