తెలంగాణ గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థుల తీరుపై ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రాజకీయ నేతలు నిరాధారంగా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని... కొందరు నాయకులు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నట్లు గమనించామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రచారాల్లో వ్యక్తిగత దూషణలు, నిరాధార ఆరోపణలు చేయరాదని సూచించింది. పార్టీలు, నాయకులపై నిజనిర్ధరణ లేనటువంటి ఆరోపణలు చేయరాదని పేర్కొంది.
తెలంగాణ : ప్రచారాల్లో వ్యక్తిగత దూషణలను తీవ్రంగా పరిగణిస్తాం : ఎస్ఈసీ
తెలంగాణ జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థలు మాట్లాడే వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం మండిపడింది. ప్రచారాల్లో వ్యక్తిగత దూషణలు, నిరాధార ఆరోపణలు చేయరాదని సూచించింది.
వ్యక్తిగత దూషణలతో వరుస ఘటనలకు దారితీసేందుకు అవకాశం ఉంటుందని... ఇది ఎన్నికల ప్రక్రియపై ప్రభావం చూపేఅవకాశం ఉందని వెల్లడించింది. ఎస్ఈసీ ఆదేశాలను ఉల్లంఘించినట్లు తమ దృష్టికి వస్తే తీవ్రంగా పరిగణిస్తామని... ఎన్నికల నిబంధనలు, మోడల్ కోడ్ను ఉల్లంఘిస్తూ వ్యాఖ్యలు చేయరాదని ఎస్ఈసీ మరోసారి స్పష్టం చేసింది.
ఇంటింటి ప్రచారం, రోడ్డుషోలు, ర్యాలీలు నిర్వహిస్తున్న సమయాల్లో కరోనా నిబంధనలు పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎస్‌ఈసీ జారీ చేసిన కరోనా నిబంధనలు అందరూ పాటించాలని సూచిస్తూ ఆదేశాలు జారీ చేసింది.