అడుగంటిన జలం... పాచినీరే ఆ గ్రామస్థులకు ఆధారం! - drink
మనం త్రాగే నీరులో చిన్న నలక వస్తేనే పడేస్తుంటాం. అలాంటిది నిల్వ ఉండి పచ్చగా మారిన చెరువు నీటినే ఓ గ్రామ ప్రజలు వినియోగిస్తున్నారు. దీనికి తోడు ఆ నీటిలో చేపలు చనిపోయి వాసన వస్తున్నప్పటికీ ప్రత్యామ్నాయం లేక వాటినే గొంతులోకి పోసుకుంటున్నారు.
కింది స్థాయి అధికారుల నిర్లక్ష్యం కృష్ణా జిల్లా కోడూరు మండలం సాలెంపాలెం గ్రామానికి శాపంగా మారింది.. నెలక్రితం కాలువలకు నీరు విడుదల చేసినా... చెరువు నిండక గ్రామం గొంతు ఎండుతోంది. ఏటా నీటితో కళకళ లాడే తటాకం నేడు వెలవెలబోతోంది. పాచి పట్టి ఆకుపచ్చగా మారి...వాసవ వస్తున్న నీరే వారు తాగేందుకు వినియోగిస్తున్నారు. బోర్ల నీరు అంతా ఉప్పుమయంగా మారింది. పైపు లైన్ల తాగునీరు ఎప్పుడొస్తుందో తెలియదు. వచ్చినా నాలుగు బిందెలే వస్తున్నాయి. చేతిపంపు నీటి కోసం మైళ్ల దూరం వెళ్లాల్సిన దుస్ధితి. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని వేడుకున్నా ప్రయోజనం లేదు. దాతలు ముందుకొస్తే ఎన్నికల కోడ్ పేరిట ఆపేస్తున్నారు. అధికారులు చేయకపోగా.. సాయం చేసేవారినీ చేయనివ్వడం లేదంటున్నారిక్కడి ప్రజలు. అరకొర నీళ్లు తాగి అస్వస్థతకు గురవుతున్నారు.