విజయవాడ రామవరప్పాడు కూడలి నుంచి కొత్తూరుతాడేపల్లి మార్గం వరకు ఉన్న రహదారి ఇది. ఒడుదొడుకులు లేకుండా ఒక్క నిమిషం కూడా వాహనం నడవని రోడ్డిది. అడుగడుగునా గుంతలే. వర్షం పడితే నీటి కుంటలే. ఏడాదిన్నరగా వాహనదారులకు నరకం చూపుతోంది ఈ రహదారి. భారీ వాహనాలు కాదు కదా.. ద్విచక్రవాహనాలు కూడా తిన్నగా వెళ్లడం అసాధ్యంగా మారింది. నిర్వహణ, మరమ్మతులకు నోచుకోక అధ్వానంగా మారిన ఈ రోడ్డును వర్షాలు మరింత దారుణస్థితికి చేర్చాయి. నీటితో నిండిన గుంతల లోతు తెలియక వాహనాలు బోల్తాపడిపోతున్నాయి.
రెండేళ్ల క్రితం వరకు ఈ రహదారి బాగానే ఉండేది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలను ఈ మార్గం మీదుగా మళ్లించాలన్న నిర్ణయంతో సమస్యలు మొదలయ్యాయి. నిత్యం వేలాదిగా భారీ వాహనాల రాకపోకలతో రహదారి దెబ్బతింటూ వస్తోంది. నిర్వహణ పూర్తిగా గాలికొదిలేయడంతో.. చిన్న గుంతలు కాస్తా పెద్దవైపోయాయి. మరమ్మతుల కోసం స్థానికుల అభ్యర్థనలు అరణ్యరోదనలుగానే మిగిలాయి. 12 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గంలో ప్రయాణానికి 10 నుంచి 15 నిమిషాలు పట్టేది. ఇప్పుడు గంట సమయం పడుతోంది.
20 అడుగుల వెడల్పున్న ఈ రహదారిపై హైదరాబాద్, భద్రాచలానికి వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. విజయవాడ కనకదుర్గ వారధి పనులు ప్రారంభించినప్పటి నుంచి భారీ వాహనాలను ఈ మార్గం వైపు మళ్లించారు. అంబాపురం, కండ్రిక, నయనవరం, పాతపాడు, జక్కంపూడి, తాడేపల్లి, కొత్తూరుతాడేపల్లి, వెలగలూరు ఈ మార్గంలోనే ఉన్నాయి.