గెలుపుకోసమే అన్ని ప్రయత్నాాలూ..
ఏకగ్రీవాలకు పెద్దపీట వేయాలని కొందరు నాయకులు ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒత్తిళ్లు పెంచుతున్నారు. జిల్లాలో ఘర్షణ వాతావరణం అలముకుంటోంది. ఏకగ్రీవాలు చేయించుకోవాలని ఒక వర్గం ప్రయత్నిస్తోంటే.. పోటీ చేసి సత్తా నిరూపించుకోవాలని మరో వర్గం నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఆధిపత్యం కోసం వివిధ ప్రాంతాల్లో చేస్తున్న బెదిరింపులు, ప్రలోభాల ప్రభావం రాబోయే పరిషత్ ఎన్నికల నాటికి ఏరూపు దాల్చుతుందో అన్న ఆందోళనకు బీజం పడుతోంది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలన్న ఎన్నికల కమిషన్ ఆదేశాలకు భిన్నమైన పరిస్థితులు పలు పంచాయతీల్లో ఉత్పన్నమవుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలను అధికార వైకాపాతో పాటు ప్రధాన ప్రతిపక్షమైన తెదేపా, జనసేనలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.
బెదిరింపులు.. దాడులు:
గతంలో పార్టీలకు అతీతంగా వర్గపోరుతో సతమతమయ్యే గ్రామాల్లో మాత్రమే గెలుపు కోసం పెద్ద ఎత్తున పైరవీలు, ప్రలోభాల పర్వాలు ఉండేవి. ప్రసుత ఎన్నికల విషయంలో ప్రధాన రాజకీయ పక్షాలు పట్టుదలతో వ్యవహరిస్తుండటంతో తాజాగా బెదిరింపులు, దాడుల వంటివి తెరపైకి వచ్చాయి. కొన్ని నియోజకవర్గాల్లో అధికారం చేతులో ఉన్న వ్యక్తులు పార్టీ అధినేతను ప్రసన్నం చేసుకునే క్రమంలో మెజార్టీ పంచాయతీలను తమఖాతాలోకి చూపించుకునేందుకు తమదైన శైలిలో వ్యవహరిస్తున్నారు.
పాత ఒప్పందాలకు నీళ్లు..
కొవిడ్ ముందు నిర్వహించాల్సిన పరిషత్, పురపాలిక ఎన్నికల సందర్భంగా చేసుకున్న ఒప్పందాలను సైతం తుంగలోకి తొక్కేస్తున్నారు. ముందస్తు చేసుకున్న ఒప్పందం పాటించలేదనే కారణంతో పెనుగంచిప్రోలు మండలం లింగగూడెంలో ఓవ్యక్తి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. కొన్ని పంచాయతీల్లో నామపత్రాలు దాఖలు చేయకుండా అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.
కైకలూరు మండలం శృంగవరప్పాడులో ఇరు వర్గాల మధ్య చోటు చేసుకున్న దాడిలో పలువురు గాయపడ్డారు. నామినేషన్‌ను వేయనీయకుండా అడ్డుకునే క్రమంలో దాడులకు వెనుకాడటం లేదు. జి.కొండూరు మండలానికి ఓ అభ్యర్థిని తనను నామినేషన్ వేయకుండా అడ్డగించారని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.