రాష్ట్ర ప్రభుత్వం నిధులు దారి మళ్లిస్తే పెను ఉత్పాతానికి దారి తీస్తుందని, తక్షణమే లోటుపాట్లను సరిదిద్దాలని సీఎం జగన్‌కు వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. ‘రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.41 వేల కోట్లకు పైగా నిధులకు సరైన లెక్కలు చూపలేదని మీడియా, ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. మొత్తం రూ.41,043.08 కోట్లకు సంబంధించిన 10,806 బిల్లులను ప్రత్యేక కేటగిరీ బిల్లులుగా పేర్కొంటూ ట్రెజరీ కోడ్‌కు విరుద్ధంగా డ్రా చేశారని ముఖ్య అకౌంటెంట్ జనరల్ లతా మల్లికార్జున రాష్ట్ర ప్రభుత్వ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్‌కు లేఖ రాశారు. ఎలాంటి వోచర్లు, మంజూరు పత్రాలు, తీసుకున్నవారి వివరాలు, డ్రాయింగ్ అండ్ డిస్బర్స్‌మెంట్ అధికారి సంతకాలు లేకుండా తీసుకున్నందున వీటన్నింటినీ అనుమానాస్పద బిల్లులుగానే పరిగణించాల్సి ఉంటుంది.
ఇంత పెద్ద మొత్తంలో నిధులకు లెక్కలు చూపకపోవడం పొరపాటున జరిగింది కాదు. దీనిపై స్పష్టమైన వివరాలతో, బాధ్యతాయుతమైన సమాధానం చెప్పడానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి ముందుకు రావాలి. సమగ్ర ఆర్థిక యాజమాన్య వ్యవస్థ (సీఎఫ్‌ఎంఎస్) విషయాన్ని పక్కన పెడితే ఈ చెల్లింపులు ఎవరికి చేశారు? ఎందుకు చేశారో ప్రజలకు వివరణ ఇవ్వాలి. సీఎఫ్‌ఎంఎస్ సక్రమంగా పని చేయడం లేదంటూ.. ఉపాధి హామీ కింద పనులు చేసిన అతి చిన్న గుత్తేదారులకు కూడా బిల్లులు ఆపేసిన మీరు, అదే వ్యవస్థ ద్వారా ఇంత పెద్ద మొత్తంలో చెల్లించడం అనుమానాలకు తావిస్తోంది’ అని ఎంపీ లేఖలో పేర్కొన్నారు.