ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే... తెదేపా న్యాయస్థానాలకు వెళ్లి అడ్డుకుంటోందని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. తెదేపా నేత అశోక్ గజపతి రాజుకు చరిత్ర తెలియదని... విజయనగరంలో మూడు లాంతర్ల స్థంభం పురాతన కాలం నాటిది కాదన్నారు. ఆ ప్రాంతానికి చారిత్రక నేపథ్యం ఉన్నా... ఈ స్థంబానికి పురాతన చరిత్ర లేదన్నారు. మళ్లీ కొత్తగా ఈ స్థంబాన్ని నెలకొల్పాలన్నదే తమ ఆలోచన అని అన్నారు.
పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి భూయజమానులు అంగీకారాన్ని తెలియచేస్తున్నా... తెదేపా నేతలు కోర్టుల్లో అడ్డుకునే ప్రయత్నం చేయటం ఏంటని ఆయన ప్రశ్నించారు. న్యాయస్థానాల ద్వారానే ఈ అంశాలపై పోరాటం చేస్తామని మంత్రి తెలిపారు.
మహానాడులో వివిధ అంశాలపై చర్చించే తెదేపా.. వైకాపా వారిని కూడా జూమ్ యాప్ ద్వారా ఆన్లైన్లో తీసుకుని మాట్లాడాలని మంత్రి సవాల్ విసిరారు. చంద్రబాబు అధికారంలో ఉంటే ఒకలా... లేకపోతే ఒకలా వ్యవహరిస్తారని ఎద్దేవా చేశారు. భూ విక్రయాలపై చంద్రబాబును మించిన వారెవరూ లేరని ఆరోపించారు.