botsa on schools: ‘ఇంటి పక్కనే పాఠశాల ఉండాలంటే ఎలా? మన వీధిలోనే బడి ఉంటుందా?’ అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ‘‘ప్రైవేటు పాఠశాలల్లో చదివించే తల్లిదండ్రులు పిల్లల్ని రోజూ బడిలో దింపి, తీసుకువస్తున్నారు కదా? అమెరికాలాంటి దేశాల్లో పాఠశాల ఉండే ప్రాంతంలో ఇళ్ల అద్దెలు, భవనాల ధరలు ఎక్కువగా ఉంటాయి. మంచి పాఠశాలకు అంత డిమాండ్ ఉంటుంది. అలాంటి ఆలోచన విధానం రావాలి. తరగతుల విలీనం కారణంగా విద్యార్థి కిలోమీటరు దూరం వెళ్లి, రావడం కష్టమన్నది తల్లిదండ్రులు అభిప్రాయం కావొచ్చు’ అని బొత్స పేర్కొన్నారు. ‘‘విలీనం మొదట మూడు కిలోమీటర్లు చేయాలనుకున్నా కిలోమీటరుకు తగ్గించాం. ఏదైనా చట్టం చేసే ముందు ప్రజాభిప్రాయం తీసుకోం కదా! ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు ప్రజల అభిప్రాయమే చెబుతారు. విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని విధాన నిర్ణయాలు తీసుకుంటున్నాం. తరగతుల విలీనంలో ఎక్కడైనా సమస్యలు వస్తే పరిశీలిస్తాం. ఏదైనా ప్రయోగాత్మకంగా చేసినప్పుడు ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి’’ అని వెల్లడించారు.
ప్రవేశాల తర్వాతే తెలుస్తుంది..
‘‘పాఠశాలల మ్యాపింగ్, విలీనం వల్ల ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలు తగ్గిపోయాయని చాలామంది అంటున్నారు. ప్రవేశాలు జరుగుతున్నాయి. ఆగస్టు 15కు పూర్తవుతాయి. ఆ తర్వాత విద్యార్థుల సంఖ్య తెలుస్తుంది. ప్రవేశాలు తగ్గాయా? పెరిగాయా? అన్నది ప్రశ్న కాదు. ప్రభుత్వ బడులను మెరుగుపరిస్తే విద్యార్థులు వారంతటవారే వస్తారు. ప్రభుత్వ బడుల్లో చదవాలనే తపన, ప్రేరణ కల్పించాలి. నిర్బంధంగా ప్రైవేటు బడులు మూసి, ప్రభుత్వ పాఠశాలలు తీసుకురావాలన్నది మా అభిమతం కాదు. విద్యార్థి తనకు నచ్చినచోట చదువుకునే ఏర్పాట్లు చేయాలి. ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే పరిస్థితులు కల్పించాలి. కొవిడ్ సమయంలో ఏడు లక్షలమంది విద్యార్థులు ప్రైవేటు బడుల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు వచ్చారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఎంతమంది ప్రవేశాలు పొందారో మొత్తం వివరాలు ఇస్తాం. దీంతోపాటు మా విశ్లేషణ ఇస్తాం. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఎందుకు తగ్గారు? ఎందుకు పెరిగారనే విశ్లేషణ ఇస్తాం’’ అని తెలిపారు.