Krishna Lanka Poor people House Sites Issueఅధికారంలోకి రాగానే కృష్ణ లంక ప్రాంతంలో నివాస ముంటున్న పేదలకు పట్టాలు ఇస్తామన్న వైఎస్సార్ సీపీ సర్కార్ హామీ నెరవేరకపోవడంతో.. పేదలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓట్లు అడగడానికి తప్ప తమ సమస్యలు పట్టించుకునే పరిస్థితిలో పాలకులు లేరని మండిపడ్డారు. ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే పట్టాలు మంజూరు చేస్తామని, ఇంటి పన్నులు కూడా వసూలు చేస్తామని చెప్పిన వైసీపీ పార్టీ నేతలు.. అధికారంలోకి వచ్చాక అడ్రస్ లేకుండా పోయారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని కృష్ణా నదీ పరివాహన ప్రాంతంలో పేదలు నివాసం ఉంటున్న కృష్ణలంక కరకట్ట ప్రాంతం ఇది. ఎన్నో ఏళ్లుగా ఇక్కడి ప్రజలు శాశ్వత గృహాలు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. కృష్ణా నదికి వరద వచ్చినప్పుడల్లా వీరంతా బిక్కుబిక్కుమంటూ జీవించాల్సిన దుస్థితి నెలకొంది.
Krishna River Basin Poor People Worst Condition :కృష్ణా నది రక్షణ గోడ నిర్మించిన తరువాత తమకు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చిన అధికార పార్టీ నేతలు.. నేడు ఆ ఊసే ఎత్తడం లేదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నలభై ఏళ్ల నుంచి ఇదే ప్రాతంలో నివాసం ఉంటున్నా.. ఇప్పటికీ తమకు పట్టాలు అందించకపోవడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. కృష్ణా పరివాహ ప్రాంతంలో నివాసం ఉండి రక్షణ గోడ నిర్మాణ సమయంలో ఇళ్లు కొల్పోయిన వారికి సింగ్ నగర్, వాంబే కాలనీ ప్రాంతాల్లో ఇళ్లు కేటాయించారు. ఆ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు సరిగ్గా లేక ఇదే ప్రాంతానికి తరిగి వచ్చి అద్దె ఇళ్లలో చాలా మంది ప్రజలు జీవనం సాగిస్తున్నారు.