ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 1, 2021, 4:07 PM IST

ETV Bharat / state

ఓటర్లు స్పందిస్తేనే...అశించిన అభివృద్ధి

ఎన్నికలంటేనే జయాపజయాలు. ఇటీవల కాలంలో ఎన్నిక ఏదైనా.. పార్టీల తీరు, అభ్యర్థుల వ్యవహార శైలి, గెలవడానికి ఎన్ని అడ్డదారులైనా తొక్కవచ్చనే విధంగా ఉంటోంది. అంతిమంగా విజయం మాత్రం తమకే దక్కాలనుకోవటంతో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోంది. గతంలో నిర్వహించిన ఎంపీటీసీ ఎన్నికల్లో ఈ విపరీత ధోరణి అందరిని ఆశ్చర్యపరిచింది. తాజాగా 2021లో వరుస ఎన్నికలు ఉండటంతో ఓటర్లు వేగంగా స్పందించి నిర్ణయాలు తీసుకుంటేనే ఆశించిన అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. జిల్లాలో నాలుగు విడతలుగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు మొదటి విడత నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తయింది. అప్పుడే కృష్ణా జిల్లావ్యాప్తంగా పంచాయతీ పీఠం దక్కించుకునేందుకు ప్రలోభాల పర్వానికి రాజకీయ పక్షాలు తెరతీశాయి.

ఓటర్లు స్పందిస్తేనే...అశించిన అభివృద్ధి
ఓటర్లు స్పందిస్తేనే...అశించిన అభివృద్ధి

2013 తర్వాత మళ్లీ..

స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా గ్రామస్థాయి పాలన బలోపేతమై అభివృద్ధికి అవకాశం ఉంటుంది. అందుకోసం ప్రతి అయిదేళ్లకోసారి పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారు. సాధారణ ఎన్నికలపై చూపే శ్రద్ధ పంచాయతీలపై చూపడం లేదు. దాదాపు ఏడున్నరేళ్ల తర్వాత మళ్లీ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. గ్రామ ప్రథమ పౌరుడిగా ఉండే సర్పంచి పదవికి సరైనవారిని ఎన్నుకోకపోతే గ్రామాభివృద్ధి కుంటుపడే ప్రమాదం ఉంది. పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరిగినా, పరోక్షంగా రాజకీయ పార్టీలు తమ మద్దతుదారులనే అభ్యర్థులుగా నిలుపుతాయనేది బహిరంగ రహస్యమే. గుర్తులు వేరైనా పార్టీ జెండాలతోనే ప్రచారం సాగుతోంది. గ్రామాల్లో పట్టు నిలుపుకోవడం కోసం సర్పంచి ఎన్నికలను ఓ పునాదిగా భావిస్తున్న నేపథ్యంలో వారి మద్దతుతో పోటీ చేయటానికి ఆశావహులు భారీగా ప్రయత్నాలు ప్రారంభించారు.

నమ్మాలా.. వద్ధా.?

‘మీ సమస్యలు మావే, వీధి దీపాలు, అంతర్గత రహదారులు, కుళాయిలు, ఇంటి అనుమతులు, కుల, జనన, మరణ ధ్రువవత్రాలు.. ఇలా ఏది కావాలన్నా క్షణంలో మీముందు వాలిపోయి పనిచేసి పెడతా, ఈసారి నన్ను నమ్ము’ అనే నాయకులు నట్టేట ముంచేవారా లేదా పని చేసేవారా అన్నది ఒక్కసారి ఆలోచించాలి. స్థానికంగా ఉండేవారి మధ్యే పోటీ అధికంగా ఉంటుంది. ప్రత్యర్థి చేసే ఖర్చుకు రెట్టింపు డబ్బు వెదజల్లే నాయకులకు పార్టీలు పెద్దపీట వేస్తున్నాయి. దీంతో సామాన్యులు, సేవాతత్పరులు పోటీ చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఓటుకు రూ.500 నుంచి రూ.5 వేల వరకు ఖర్చు చేయడానికి వెనుకాడని నాయకులే బరిలోకి వస్తున్నారు.

ఇవి పాటించండి..

●అభ్యర్థి గుణగుణాలు, గత చరిత్రను పరిగణనలోకి తీసుకోవాలి.

● సేవాభావం ఉందా, ఇచ్చిన మాటకు కట్టుబడే రకమేనా, ఏ ఎండకు ఆ గొడుగు పడతాడా అనేది బేరీజు వేసుకోవాలి.

● నీతికి కట్టుబడి ఉంటారా అనే విషయాలన్నింటిని పరిగణనలోకి తీసుకోవాలి.

● ప్రలోభాలకు గురిచేసి సర్పంచి పీఠం దక్కించుకోవాలని అనుకునేవారిని ఎక్కడికక్కడ నిలువరించాలి.

● ప్రలోభాలకు గురిచేస్తుంటే ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులకు ఫిర్యాదు చేయవచ్ఛు ఫొటోలు, వీడియోలు, మాటల్ని రికార్డు చేసి వారికి అందించవచ్ఛు.

● మద్యం, నోటులను మూకుమ్మడిగా, నిర్మొహమాటంగా నిరాకరించినప్పుడే నైతిక విలువలు నేతలకు తెలుస్తాయి.

● ఎన్నికల ప్రక్రియ రాజ్యాంగ బద్ధంగా జరగడానికి ఓటర్లు సైతం బాధ్యత వహించాల్సిందే. గ్రామాల్లోని పెద్దల తీర్పులతో ఏకగ్రీవం చేసుకోవడానికి బెదిరింపులకు పాల్పడితే చట్ట విరుద్ధమని గుర్తించి.. వాటిని నిలువరించాలి.

ఇదీ చదవండి:బడ్జెట్​ ప్రసంగం: టీమ్​ఇండియాపై ఆర్థికమంత్రి ప్రశంసలు

ABOUT THE AUTHOR

...view details