ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

FARMERS WORRY: వృథాగా పోతున్న నీరు.. సందిగ్ధంలో రైతన్నలు - రైతులు వరిసాగు తాజా వార్తలు

నీళ్లన్నీ సముద్రం పాలవుతుండటంతో.. కృష్ణా డెల్టా రైతుల్లో కలవరం మొదలైంది. సీజన్‌ ఆరంభంలో నిల్వ చేయాల్సిన నీటిని.. వృథా చేస్తుండటంతో వారిలో ఆందోళన కలిగిస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే సాగు సందిగ్ధంలో పడుతుందేమోనన్న భయం వెంటాడుతోంది.

krishna delta farmers
రైతన్నల ఆందోళనలు

By

Published : Jul 4, 2021, 1:38 PM IST

కృష్ణా డెల్టా రైతుల్లో ఆందోళన

శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతలలో.. విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా నీళ్లు వదిలేస్తుండటంతో ప్రకాశం బ్యారేజీకి వస్తున్న నీళ్లు.. వృథాగా సముద్రంలోకి చేరుతున్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో జలాశయాల్లో నిల్వ చేసుకోవాల్సిన నీటిని సముద్రంలోకి వదిలేయడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఎగువన ఉన్న జలాశయాల్లో నీరు అడుగంటితే కృష్ణా డెల్టాలో సాగుకు ఇబ్బందులు తప్పవు. నీటి లభ్యతపై స్పష్టత వచ్చాకే డెల్టాలో కాలువలకు నీటిని విడుదల చేస్తారు. అయితే కృష్ణానదిపై జలాశయాలకు తగినంత వరద లేకపోవడంతో కాలువలకు నీటి విడుదలలో జాప్యం జరుగుతుంది. గోదావరిలోనూ వరద లేకపోవడంతో పట్టిసీమ ద్వారా నీటిని ఎత్తిపోయడం లేదు. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో తెలంగాణ విద్యుత్తు ఉత్పత్తి వల్ల నీరు వృథాగా సముద్రంలోకి పోవడంతో ఈసారి సకాలంలో సాగు సాధ్యమేనా అని డెల్టా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నీటిలభ్యత ఆధారంగా సాగు..

కృష్ణాడెల్టాకు జులై 5 నుంచి నీటిని విడుదల చేయాలని.. అధికారులు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేశారు. తొలుత తాగునీటి అవసరాలకు ఇచ్చి.. నీటి లభ్యత ఆధారంగా పంటలకు నీళ్లు వదులుతారు. కృష్ణా తూర్పు డెల్టాలో నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికే రైతులు నారు మళ్లు వేసుకుంటున్నారు. పశ్చిమ డెల్టాలో ఎక్కువగా జులై 15 తర్వాత సాగు ప్రారంభిస్తారు. దీనివల్ల పంట డిసెంబరు 15 తర్వాత కోతకు వస్తే.. తుపాన్ల బెడద తప్పుతుందని రైతులు చెబుతున్నారు. వర్షాలు పడి భూమి పూర్తిగా తడిస్తేనే.. రైతులు వరిసాగుకు సమాయత్తం అవుతారు. పూర్తిగా కాలువల ఆధారంగానే భూములు దమ్ము చేయాలంటే.. నీరు భారీగా అవసరమై ఆయకట్టు చివరి రైతులకు నీరందదు. ఎగువన ఉన్న పులిచింతల, నాగార్జున సాగర్ నీటిలభ్యత ఆధారంగా సాగు ప్రారంభిస్తారు.

కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాలకు 143.21 టీఎంసీలు అవసరం. ఇందుకు పట్టిసీమ ద్వారా 80 టీఎంసీల గోదావరి జలాలు, సాగర్, పులిచింతల, బ్యారేజీ ఎగువ వాగుల ద్వారా 63.21 టీఎంసీలు సమకూరుతుందని ఇంజినీర్లు లెక్కించారు. పట్టిసీమ నుంచి నీటిని తీసుకుంటూ అవసరమైనప్పుడల్లా సాగర్, పులిచింతలలో నిల్వ నీటిని వాడుకుంటారు. ఎగువన ఉన్న జలాశయాల్లో నీటిని విద్యుత్తు ఉత్పత్తి ద్వారా ఖాళీ చేస్తుండటంతో సాగు ఆలస్యమవుతుందన్న ఆందోళన మొదలైంది.

ఇదీ చదవండి:

కృష్ణాజలాల అంశంపై తెలంగాణ హైకోర్టులో ఏపీ రైతు పిటిషన్‌

టీకా పంపిణీలో భారత్​ మరో మైలురాయి

ABOUT THE AUTHOR

...view details