ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Kharif Grain: నత్తనడకన ఖరీఫ్ ధాన్యం కొనుగోలు..మార్చి వచ్చినా పూర్తి కాని లక్ష్యం

Kharif Crop: రబీ పంట చేతికొచ్చే సమయం సమీపిస్తున్నా.. ఇంత వరకూ ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలే పూర్తి కాలేదు. ఖరీఫ్ ధాన్యం కొనుగోలు నత్తనడకన సాగుతోంది. లక్ష్యంలో 75శాతం మాత్రమే పూర్తయింది. శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా జిల్లాల్లో పలు చోట్ల ధాన్యం నూర్పిడి చేసి నెలలు గడుస్తున్నా సేకరణకు నోచుకోలేదు. చేసేది లేక రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు.

Kharif grain buying issues in AP
నత్తనడకన ఖరీఫ్ ధాన్యం కొనుగోలు

By

Published : Mar 14, 2022, 8:01 AM IST

Kharif grain: ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలు నత్తనడకన సాగుతోంది. రబీ పంట చేతికొచ్చే సమయం సమీపిస్తున్నా.. లక్ష్యంలో 75శాతం మాత్రమే పూర్తయింది. శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా జిల్లాల్లో పలు చోట్ల ధాన్యం నూర్పిడి చేసి నెలలు గడుస్తున్నాయి. సేకరణకు నోచుకోక రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు. మద్దతు ధరపై ధాన్యం కొనాలంటే పుట్టికి (850 కిలోలు) అదనంగా 150 కిలోలకుపైగా ఇవ్వాల్సి వస్తోందనే ఆవేదన రైతుల్లో వ్యక్తమవుతోంది. దీంతో రైతులు కోవూరులో ఆందోళనకు దిగారు. రైతులకు గడువులోగా సొమ్ము చెల్లింపులోనూ జాప్యం తప్పడం లేదు. పేరుకే 21 రోజులని చెబుతున్నా గడువు దాటాకా ఖాతాలో డబ్బులు జమ కావడం లేదనే ఆవేదన రైతుల్లో వ్యక్తమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 13 నాటికి సేకరించిన ధాన్యం విలువ రూ.7,350 కోట్లు కాగా.. అందులో గడువు దాటిన బకాయిలు రూ.1,500 కోట్లకుపైగా ఉన్నట్లు అంచనా. ధాన్యం మిల్లుకు తోలిన సమయం నుంచి లెక్కలోకి తీసుకుంటే 2 నెలలపైనే పడుతోందని రైతులు వాపోతున్నారు. రైతు భరోసా కేంద్రాల్లో రైతుల పేర్లు నమోదు చేయించాక 21 రోజుల సమయం లెక్కిస్తున్నారని పలువురు వివరిస్తున్నారు. బ్యాంకులకు డబ్బులు పంపినట్లు చెబుతున్నా ఖాతాలో జమ కాలేదని కొందరు వాపోతున్నారు. ధాన్యం సేకరణకు సంబంధించిన సమాచారమంతా గతంలో పౌర సరఫరాలశాఖ వెబ్‌సైట్‌లో ఉంచేవారు. జిల్లాలు, మండలాలు, సేకరణ కేంద్రాలవారీగా కొనుగోలు, చెల్లింపులూ ఉండేవి. ఇప్పుడా పారదర్శకత కొరవడింది. జిల్లాలవారీ ఎంత కొనుగోలు చేయాలి? ఎంత సేకరించారు? 21 రోజుల గడువులోగా ఎంత మొత్తం చెల్లించారు? అనే వివరాలు ఇవ్వడం లేదు. అంతా రహస్యమన్న తీరుగా ఉందని రైతు సంఘాల నేతలు పేర్కొంటున్నారు.

లక్ష్యం 50 లక్షల టన్నులు- కొనుగోలు మాత్రం 37.77 లక్షల టన్నులే....

రాష్ట్రంలో 2021 ఖరీఫ్‌కు సంబంధించి 50 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని పౌర సరఫరాలశాఖ లక్ష్యంగా నిర్ణయించింది. ఫిబ్రవరి నెలాఖరుకు రూ.7,350 కోట్ల విలువైన 37.77 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ఇందులో 13 రోజుల్లో సేకరించిన ధాన్యం 1.45 లక్షల టన్నులే. ఫిబ్రవరిలోనూ 9.85 లక్షల టన్నులే కొన్నారు.

రోజుల తరబడి తిరగాల్సిందే

ఫిబ్రవరి మొదటివారం నుంచే సేకరణ మందగించిందని రైతులు వాపోతున్నారు. రోజుల తరబడి తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘పుట్టి ధాన్యాన్ని (850 కిలోలు రూ.16,660) మద్దతు ధరపై కొనాలంటే అదనంగా 150 నుంచి 170 కిలోలు ఇవ్వాలని మిల్లర్లు డిమాండు చేస్తున్నారు. ఎకరాకు మూడు పుట్లు ధాన్యం పండిస్తే 450కిలోలకుపైగా వారికి ఇవ్వాల్సి వస్తోంది. దీనిపై ఆందోళన చేయడంతో.. నిబంధనల ప్రకారం కొనుగోలు చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు’ అని నెల్లూరు జిల్లా కోవూరుకు చెందిన శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ధాన్యం నిల్వలున్నా కొనుగోలు నామమాత్రమే. విజయనగరం జిల్లాలో క్వింటా రూ.1,300 నుంచి రూ.1,400 చొప్పున దళారులకు అమ్ముకుంటున్నామని రైతులు పేర్కొంటున్నారు.

ఈ-పంట పేరుతో కొర్రీలు

పలు జిల్లాల్లో ఈ-పంట నమోదు పేరుతో ధాన్యం కొనుగోలుకు కొర్రీలు వేస్తున్నారు. ఈ-పంట పక్కాగా నమోదు చేశామని ఎప్పటికప్పుడు చెబుతున్నా క్షేత్రస్థాయిలో రైతుల అవస్థలను పట్టించుకోవడం లేదు. పంట ఉత్పత్తుల సేకరణకు దీన్నే ప్రామాణికంగా తీసుకుంటుండటంతో భూమి ఉన్న వారితోపాటు కౌలు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. నమోదు సమయంలో ఉన్న పేర్లు, విస్తీర్ణాలు అమ్మకం సమయానికి కన్పించడం లేదు. తామేం చేయలేమని సచివాలయ సిబ్బంది చెబుతున్నారు. మాగాణి రైతుల్లో అధికశాతం కౌలుకు చేసినవారే. ఈ-పంట నమోదులో మీ పేరు లేదంటూ వారి నుంచి ధాన్యం కొనడం లేదు. యజమానుల పేర్లతోనే అమ్ముకోవాల్సి వస్తోందనే ఆవేదన పలువురిలో వ్యక్తమవుతోంది.

ఇదీ చదవండి :

అగ్నికి ఆహుతైన నాలుగు ఎకరాల అరటి తోట.. ఆదుకోవాలంటున్న అన్నదాత

ABOUT THE AUTHOR

...view details