Pawan kalyan: అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం సెజ్‌లో తరుచూ చోటు చేసుకుంటున్న ప్రమాదాలు ఆందోళనకరంగా ఉన్నాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం ఎంతటి విధ్వంసాన్ని సృష్టించిందో.. ఎంతమంది ప్రాణాలను హరించిందో ఎప్పటికీ మరచిపోలేమన్నారు. అచ్యుతాపురం సెజ్‌లో సీడ్స్ కంపెనీలో విషవాయువు లీకై 125 మంది మహిళలు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలవడం దురదృష్టకరమన్నారు. ఈ ఘటనకు ప్రజా ప్రతినిధులు, అధికార గణం నిర్లిప్తతే కారణమని ఆరోపించారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు.
‘‘ఇదే కంపెనీలో నెల క్రితమే ఇలాంటి ప్రమాదమే జరిగింది. అప్పుడు 400 మంది అస్వస్థతకు గురయ్యారు. ఇది పునరావృతం అయింది. అయితే ప్రమాదానికి కారణాలు ఏంటనే వివరాలను అధికారులు, ఇటు కంపెనీ ప్రతినిధులు చెప్పకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రధానంగా ఔషధ, రసాయన, ఉక్కు, జౌళి కర్మాగారాల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. పరవాడ, దువ్వాడ, అచ్యుతాపురం పారిశ్రామిక ప్రాంతాల చుట్టుపక్కల కాలనీవాసులు ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందో, ఏ విషవాయువు ప్రాణాలు తీస్తుందో అని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.