కృష్ణాజిల్లాలో కరోనా కేసులు రోజు రోజుకూ మరింత పెరుగుతున్నాయి. జిల్లాలో తాజాగా గురువారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం ఉదయం 10 గంటల వరకూ మరో 16 పాజిటివ్ కేసులు వెలుగుచూడగా, వీటిలో 15 కేసులు విజయవాడ నగరంలోనే నమోదయ్యాయి. ఒక కరోనా కేసు గొల్లపూడిలో నమోదైంది.
కృష్ణా జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు
కృష్ణాజిల్లాలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. 24 గంటల్లో జిల్లాలో 16 పాజిటివ్ కేసులు వెలుగుచూడగా... అందులో 15 కేసులు విజయవాడలోనే నమోదయ్యాయి.
కొత్తగా నమోదైన కేసుల్లో విజయవాడలోని కె.ఎల్.రావు నగర్లోనే ఎక్కువ కేసులుండగా, ఆ తర్వాత స్థానంలో కృష్ణలంక ఉంది. ఇప్పటివరకూ నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 425 కు చేరింది. తాజాగా కెఎల్.రావునగర్‌కు చెందిన వృద్ధురాలు చనిపోవడంతో ఆమెకు కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. దీంతో అధికారికంగా జిల్లాలో ఒక మృతి నమోదైనట్టు అధికారులు శుక్రవారం ప్రకటించారు. దీంతో జిల్లాలో ఇప్పటివరకూ చనిపోయిన వారి సంఖ్య 16 కు చేరింది.
ఇప్పటివరకూ నగరంలోని కృష్ణలంక, కార్మికనగర్, విద్యాధరపురం, ఖుద్దూసనగర్, సింగ్ నగర్ లాంటి ప్రాంతాలే ఉండగా .. తాజాగా కె.ఎల్.రావునగర్ ఈ జాబితాలో చేరింది. రెండు రోజుల వ్యవధిలో కె.ఎల్.రావునగర్ లో పది పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ఈ ప్రాంతంలోని వంద మందికి పైగా అనుమానితులకు కరోనా నిర్ధారణ పరీక్షలను శుక్రవారం నిర్వహించారు. వీరిలో ఎంతమందికి పాజిటివ్ వస్తుందనేది ప్రస్తుతం అందరిలోనూ ఆందోళన రేకెత్తిస్తోంది. జిల్లాలో ఉన్న 425 పాజిటివ్ కేసుల్లో, 139 కృష్ణలంకకు చెందినవే ఉన్నాయి. ప్రస్తుతం దుకాణాలు ఉదయం నుంచి తెరుస్తుండటంతో రద్దీ పెరిగింది. అందుకే రోడ్డుపైకి వచ్చేవారు తప్పనిసరిగా మాస్క్ ధరించి భౌతికదూరం పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.