కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలంలో ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయి. అయితే అవి నిబంధనల ప్రకారం జరగడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ అధికారుల పర్యవేక్షణ పేరుకే తప్ప క్షేత్రస్థాయిలో కనిపించడం లేదంటున్నారు స్థానికులు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే ఇసుక మాఫియా కొనసాగుతోందంటూ ఆరోపిస్తున్నారు.
తోట్లవల్లూరు మండలం ఉత్తర వల్లూరుపాలెంలో నాగవెంకటరెడ్డి అనే రైతు.. తనకున్న 9 ఎకరాలలో ఇసుక తవ్వుకునేందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చుకున్నాడు. తన పొలంలో ఇసుక తవ్వి అమ్ముకున్నారు. అది అయిపోవటంతో పక్కనున్న తమ పొలాల్లో ఇసుక తవ్వుతున్నారంటూ రైతులు ఆరోపిస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే పోలీసులు, రెవెన్యూ అధికారులు దుర్భాషలాడుతున్నారని వాపోయారు.
నాగవెంకటరెడ్డి సరిహద్దు రైతులైన కొంతమంది తమ పొలాల్లో పంటలు వేసుకున్నారు. ఇప్పుడు వాటిల్లోనూ అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. తవ్వకాలు చేపట్టేటప్పుడు అధికారులు సరిహద్దులు వేసి పనులు ప్రారంభించాలి. అయితే హద్దులు వేసేటప్పుడు తమను పిలవలేదని సరిహద్దు రైతన్నలు అంటున్నారు. వారి ఇష్టానుసారం హద్దులు వేసుకుని ఇష్టంవచ్చినట్లు ఇసుక తవ్వేస్తున్నారని విమర్శించారు.
నాకు 4 ఎకరాల పొలం ఉంది. అందులో పంటలు వేసుకున్నాను. దానికి 20 మీటర్ల దూరంలో ఇసుక తవ్వుతున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నారు. ఎమ్మార్వే వద్దకు సమస్యను తీసుకెళ్లినా ప్రయోజనం లేదు. మాకింక ప్రభుత్వమే న్యాయం చేయాలి -- శివరామిరెడ్డి, రైతు