రాష్ట్రంలో పశ్చిమ-నైరుతి దిశలో గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో రాగల 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రత్యేకించి ఉత్తర, దక్షిణ కోస్తాలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. రాయలసీమలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగతా చోట్ల వాతావరణం పొడిగా ఉంటుందని స్పష్టం చేసింది.
రోడ్లన్నీ జలమయం..
విజయవాడలో బుధవారం రాత్రి 11.30 గంటల నుంచి 12.30 గంటల వరకు ఏకధాటిగా కురిసిన వర్షంతో రహదారులు జలమయమయ్యాయి. ఈదురుగాలులతో బందరు రోడ్డులో భారీ వృక్షం నేలకొరిగింది.
ప్రకాశం జిల్లా వేటపాలెం,చినగంజాం ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. చీరాల పట్టణంలో అర్ధరాత్రి మూడు గంటలసేపు పైగా కురిసిన భారీ వర్షానికి రహదార్లు జలమయమయ్యాయి. అర్ధరాత్రి ఉరుములు,మెరుపులతో కూడిన వర్షం భయానకంగా మారింది. పట్టణమంతా తడిచిముద్దయింది. కారంచేడు, చీరాల ప్రాంతాలో 10 సెంటిమీటర్లు, రాజధాని ప్రాంతంలో తాడికొండ, రాయపూడి, తుళ్లూరు, గుంటూరు జిల్లా గురజాల, దాచేపల్లి, పిడుగురాళ్ల తదితర ప్రంతాల్లో 8 సెంటిమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది.
గుంటూరు జిల్లాలో నిన్న రాత్రి నుంచి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. రెండున్నర గంటల పాటు ఏకధాటిగా కురిసిన వర్షాలకు జిల్లాలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైన వర్షపు నీరు నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గ్రామీణ పంట పొలాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. కాల్వలు వర్షపునీటితో ఉదృతంగా పారాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు జిల్లాలో సగటున 37.4 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది.