Head constable wife committed suicide ప్రాణప్రదంగా చూసుకోవాల్సిన భర్త అనుమానిస్తూ నిత్యం వేధింపులకు గురి చేస్తుండటంతో ఆ ఇల్లాలు భరించలేకపోయింది. అమ్మానాన్నలకు కూడా భారం కాకూడదని భావించి బలవన్మరణానికి పాల్పడింది. తల్లిదండ్రులు, పిల్లలను క్షమించమని కోరుతూ.. తాను పడిన వేదనంతా ఓ లేఖలో రాసి ఆత్మహత్య చేసుకుంది. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా నస్పూర్ నాగార్జునకాలనీలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చెన్నూరు మండలం సుద్దాల గ్రామానికి చెందిన ఆకుదారి కిష్టయ్యకు, నస్పూర్‌కు చెందిన వనిత (35)తో 15ఏళ్ల క్రితం వివాహమైంది. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కిష్టయ్య కుటుంబంతో నాగార్జునకాలనీ సింగరేణి క్వార్టర్‌లో అద్దెకు ఉంటున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. అనుమానంతో అతను వనితను తరచూ తీవ్రంగా వేధిస్తుండటంతో ఆమె భరించలేకపోయింది. సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన భర్తకు ఆమె ఉరేసుకొని కనిపించడంతో ఇరుగుపొరుగు వారికి చెప్పి అక్కడి నుంచి పరారయ్యాడు.