జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్సీఆర్బీ) చెబుతున్న లెక్కల ప్రకారం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ఎక్కువ మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వ్యవసాయశాఖ మంత్రి కె.కన్నబాబు అన్నారు. 2019లో ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం ఏపీలో 1029 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టుగా తేలిందని... వైకాపా ప్రభుత్వం జూన్- 2019లో అధికార పగ్గాలు చేపట్టిందని మంత్రి వ్యాఖ్యానించారు. దీన్నిబట్టి చూస్తే తెదేపా తప్పిదాల వల్లే రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని మంత్రి ఆరోపించారు.
ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలకు 7 లక్షల రూపాయల పరిహారాన్ని అందిస్తున్నామని మంత్రి కన్నబాబు తెలిపారు. 2020-21లో 49.45 లక్షల కుటుంబాలకు రైతు భరోసా పేరిట పెట్టుబడి సహాయం అందించామని అన్నారు. ఇప్పటి వరకూ 10,200 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేశామన్నారు. 2020లో 157 మంది ఆత్మహత్య చేసుకుంటే త్రిసభ్య కమిటీ 33 కేసులను నిర్ధారించిందని తెలిపారు. మరోవైపు 41,241 కోట్ల రూపాయల మేర పంట రుణాలు అందించినట్టు వివరించారు.