రాష్టంలోని అన్ని విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో మొత్తం 90వేల కన్వీనర్ కోటా సీట్లు ఉన్నాయి. మేనేజ్‌మెంట్ కోటాలోని మరో 40వేల సీట్లను కలుపుకుని మొత్తం లక్షా 30వేల వరకు ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. గత నాలుగేళ్లుగా ఇంజనీరింగ్ కళాశాలల్లో సీట్లు అంతంత మాత్రంగానే నిండుతున్నాయి. పేరున్న కళాశాలల్లో మాత్రమే మేనేజ్‌మెంట్ కోటా సీట్లు భర్తీ అవుతున్నాయి. సాధారణ కళాశాలలైతే కన్వీనర్ కోటాలో సీట్లు నింపుకోడానికీ నానా తంటాలు పడుతున్నాయి..
ఆదరణ కోల్పోతున్న ఇంజినీరింగ్ విద్య
రాను రాను ఇంజినీరింగ్ విద్య ఆదరణ కోల్పోతోంది. పేరున్న కళాశాలల్లో మినహా మిగతా వాటిలో సీట్లు ఖాళీగానే మిగిలిపోతున్నాయి. ఈ ఏడాదీ అదే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్ కళాశాలల్లో 90వేల సీట్లు ఉండగా.... ఇప్పటివరకు 60వేల మంది విద్యార్థులు మాత్రమే కౌన్సెలింగ్ రుసుము చెల్లించారంటేనే పరిస్థితి అర్థమవుతోంది.
ఈ ఏడాది లక్షా 31 వేల 994 మంది విద్యార్థులు ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగంలో ఉత్తీర్ణత సాధించగా... కౌన్సెలింగ్‌లో జాప్యం వల్ల చాలా మంది ఇతర రాష్ట్రాల్లోని కళాశాలల్లో చేరిపోయారు. మంచి ర్యాంకు రాలేదనుకున్న మరికొందరు ఇతర డిగ్రీ కోర్సులను ఎంచుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం పరీక్షలు రాసి మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులు అటు వెళ్లిపోయారు. ఈ నెల 1 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతుండగా.... నేటితో ఇది ముగియనుంది.
ఇప్పటివరకు కేవలం 61వేల 655 మంది విద్యార్థుల మాత్రమే ఆన్‌లైన్‌లో రుసుములు చెల్లించారు. గడువు ముగిసే నాటికి కనీసం 70వేల మందైనా రుసుములు చెల్లిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ఈడబ్ల్యూఎస్, కాపు రిజర్వేషన్ల అంశంపై కేంద్రం నుంచి స్పష్టత రాకపోవడమూ విద్యార్థులు వెనుకంజ వేసేందుకు కారణమవుతోంది. కౌన్సెలింగ్ ప్రక్రియలో లోకల్ స్టేటస్ ధ్రువపత్రాల విషయంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు అధికారులను కోరుతున్నారు.