గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీపీ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. తెదేపా ఎంపీపీ అభ్యర్థి జబీన్ బీసీ కాదని జిల్లా పాలనాధికారి వివేక్ యాదవ్ స్పష్టం చేశారు. గతంలో తహశీల్దార్ ఇచ్చిన నివేదికను కలెక్టర్ సమర్థించారు. జబీన్ కుల ధ్రువీకరణకు సంబంధించి 38పేజీలతో కూడిన నివేదికను సిద్ధం చేశారు. ఈ నివేదికను శుక్రవారం ఎంపీపీ అభ్యర్థి జబీన్‌కు, హైకోర్టుకు జిల్లా కలెక్టర్ పంపారు.
దుగ్గిరాల మండలంలో మొత్తం 18 ఎంపీటీసీ సభ్యుల స్థానాలు ఉండగా.. 9 తెదేపా, జనసేన 1, వైకాపా 8 గెలుచుకున్నాయి. మెజారిటీ స్థానాలు గెలుచుకున్న తెదేపా.. ఎంపీపీ పదవిని దక్కించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే.. ఎంపీపీ స్థానం బీసీకి రిజర్వు అయ్యింది. తెదేపా నుంచి గెలిచిన తొమ్మిది మందిలో జబీన్ ఒక్కరే బీసీ కావడంతో.. ఆమెనే ఎంపీపీ చేసేందుకు సిద్ధమైంది.
ఈ క్రమంలో.. ఎంపీపీ అభ్యర్థి జబీన్ బీసీ కులధ్రువీకరణ పత్రానికి దరఖాస్తు చేసుకున్నారు. కానీ.. అధికారులు దాన్ని తిరస్కరించడంతో ఉత్కంఠ మొదలైంది. ఆ తర్వాత.. తెదేపా నేతలు కలెక్టర్‌కు అప్పీలు చేసుకోవడం, ధ్రువపత్రం మంజూరులో జాప్యం జరగడం, జబీన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం వంటి పరిణామాలతో.. ఎడతెగని ఉత్కంఠ కొనసాగుతూ వచ్చింది.
ఈ విషయమై స్పందించిన న్యాయస్థానం.. జబీన్ కుల ధ్రువీకరణపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ను ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో వారం రోజులపాటు ఎన్నిక వాయిదా పడింది. ఈ నేపథ్యంలో.. కుల ధ్రువీకరణపై కలెక్టర్ ఎలాంటి నివేదిక ఇస్తారన్న విషయమై జోరుగా చర్చ సాగింది. అయితే.. తాజాగా కోర్టుకు నివేదిక పంపిన కలెక్టర్.. జబీన్ బీసీ కాదని తేల్చారు. దీంతో.. రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ మొదలైంది. తెదేపా ఎంపీపీ అభ్యర్థికి బీసీ కులధ్రువీకరణ పత్రం మంజూరైతే.. ఎంపీపీతోపాటు ఉపాధ్యక్ష, కో-ఆప్షన్ పదవులు ఆ పార్టీకే దక్కుతాయని నేతలు భావించారు. కానీ.. కథ అడ్డం తిరిగింది. దీంతో.. తెదేపా తీసుకోబోయే నిర్ణయం ఆసక్తికరంగా మారింది.
ఇదీ చదవండి:DEVARAGATTU : బన్నీ ఉత్సవంలో చెలరేగిన హింస... వందమందికిపైగా గాయాలు