కృష్ణా జిల్లా గన్నవరం మండలం తెంపల్లిలో తాగునీటి కలుషితంతో అతిసార విజృంభించింది. గ్రామంలో ఇద్దరు చనిపోగా... సోమవారం మరొకరు మృతి చెందారు. ఇప్పటిదాకా వందమందికి పైగా అతిసార బారినపడ్డారు. 70 మంది కోలుకోగా 30 మంది చికిత్స పొందుతున్నారు.
తెంపల్లిలో ఈ నెల 15న అతిసార వల్ల ఒకేరోజు 33 మందికి వాంతులు, విరేచనాలయ్యాయి. కొందరిని విజయవాడ సహా చుట్టుపక్కల ఆసుపత్రులకు తరలించారు. పరిస్థితి విషమించి నాగబోయిన రాఘవేంద్రరావు(36), పల్లపోతు వెంకట్రావమ్మ(81) అదేరోజు చనిపోయారు. విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొలుసు మహేష్(62) సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు.
పరిస్థితి చేయిదాటి వారం గడుస్తున్నా సరైన తాగునీటి వసతిని కల్పించక పోవడంపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్రామంలో అధికారులతో పాటు పర్యటించిన జిల్లా కలెక్టర్ రంజిత్ భాషాను ఈ విషయమై నిలదీశారు. బాధితులను పరామర్శించేందుకు తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు తెంపల్లి వచ్చారు. వందమందికి పైగా అస్వస్థతకు గురయ్యారని, అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కలుషిత తాగునీటివల్లే:తెంపల్లిలో అతిసారకు ప్రధాన కారణం తాగునీటి కలుషితమేనని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ప్రకటించారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం(ఆర్‌డబ్ల్యూఎస్)ఎస్‌ఈ లీలాకృష్ణపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెంపల్లికి కేటాయించిన రూ.32 లక్షలతో వెంటనే పనులను ప్రారంభించాలని ఎస్‌ఈని కలెక్టర్ ఆదేశించారు.
ఇవీ చదవండి: