సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేవాళ్లు భయపడే విధంగా కేసులుపెట్టి అరెస్టు చేసే వారికి... సీఎంగా ఉండే అర్హతలేదని ప్రతిపక్షంలో ఉండగా జగన్ అన్న వ్యాఖ్యలను తెదేపా నేత దేవినేని ఉమ గుర్తుచేశారు. తాను అన్న మాటలు సీఎం జగన్కు గుర్తు ఉన్నాయా? అంటూ ప్రశ్నించారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యాలను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఉమ.. 66ఏళ్ల మహిళపై కేసుపెట్టిన సీఎంకు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత ఎక్కడుందో ప్రజలు అడుగుతున్నారని ప్రశ్నించారు.
కరోనా కష్టకాలంలో విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలను దోచుకుంటున్నారని ఉమ మండిపడ్డారు. 3 నెలల విద్యుత్ బిల్లులు రద్దు చేసి పాతస్లాబు విధానంలోనే బిల్లులను వసూలు చేయాలని డిమాండ్ చేశారు.
కోటి 35లక్షల మంది విద్యుత్ వినియోగదారులకు ఛార్జీలు పెంచబోమని సీఎం ఇచ్చిన హామీ ఏమైందో సమాధానం చెప్పాలన్నారు. పొట్టకూటి కోసం రోడ్డెక్కిన భవన నిర్మాణ కార్మికులు, ఉపాధి హామీ కూలీలు, చిరు వ్యాపారులు, సామాన్య ,మధ్యతరగతి వారి వాహనాలను ప్రభుత్వం సీజ్ చేయడాన్ని ఉమ తప్పుబట్టారు. స్టేషన్ల ముందు లక్షలాది వాహనాలు తుప్పుపట్టి పోతున్నాయన్న ఆయన.. పెనాల్టీలు లేకుండా తక్షణమే వాటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:అక్రమంగా రైలు టికెట్ల విక్రయం.. 14 మంది అరెస్టు