కృష్ణా జిల్లా పెద్దగుడుమోటుకు చెందిన నవ్య గర్భిణీ. ఆమెకు నొప్పులు రావటంతో అవనిగడ్డ ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు కోడూరుకు చెందిన 108 వాహనానికి కుటుంబసభ్యులు ఫోన్ చేశారు. వెంటనే వచ్చిన వాహనం ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా దారిలో నొప్పులు ఎక్కువయ్యాయి. 108 వాహనంలో ఉన్న మెడికల్ సిబ్బంది రవికిరణ్ గర్భిణీ తల్లి సాయంతో ఆమెకు ప్రసవం చేశారు. నవ్యకు బాబు పుట్టాడు.
108 ఆపరేషనల్ ఎగ్జిక్యూటివ్ అస్మతుల్లాకు సమాచారం అందించగా.. ఆయన సలహా మేరకు నాగాయలంక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ నర్సు తల్లీబిడ్డను పరిశీలించి క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. సకాలంలో స్పందించి గర్భిణీకి ప్రసవం చేసిన 108 సిబ్బందికి ఆమె కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.