ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Daughters Day Special : కంటే కూతుర్నే కనాలి... - chittoor news

‘అబ్బాయిని చదివిద్దాం... అమ్మాయికి పెళ్లిచేసి పంపిద్దాం!’  అనే ఆలోచనాధోరణి క్రమంగా మారుతోంది!  ‘ఆడపిల్లంటే అనుకున్నది సాధించి చూపిస్తుంది.. ఇంటికి అండగా ఉంటుంది’  అనే నమ్మకం.. భరోసా తల్లిదండ్రుల్లో బలపడుతోంది. అది 100 శాతం నిజమేనని నిరూపించారీ అమ్మాయిలు..

Daughters Day Special :
కంటే కూతుర్నే కనాలి...

By

Published : Sep 26, 2021, 1:06 PM IST

జాతీయ కూతుళ్ల దినోత్సవ ప్రత్యేకం

‘అబ్బాయిని చదివిద్దాం... అమ్మాయికి పెళ్లిచేసి పంపిద్దాం!’ అనే ఆలోచనాధోరణి క్రమంగా మారుతోంది! ‘ఆడపిల్లంటే సాధించి చూపిస్తుంది.. ఇంటికి అండగా ఉంటుంది’ అనే నమ్మకం... భరోసా తల్లిదండ్రుల్లో బలపడుతోంది. అది 100 శాతం నిజమే అని నిరూపించారీ అమ్మాయిలు...

తల్లితో సాయి మానస, సివిల్స్‌ ర్యాంకర్

మా నమ్మకానికి తన ర్యాంకే రుజువు...

మాది చిత్తూరు జిల్లా సందిరెడ్డిపల్లె. నేను ఆంగ్ల ఉపాధ్యాయురాలిగా చేసి, వాలంటరీ రిటైర్‌మెంట్‌ తీసుకున్నా. మా వారు నందకుమార్‌ రైతు, ఊరి ఉప సర్పంచి కూడా. మాకిద్దరూ అమ్మాయిలే. అబ్బాయిలు లేరన్న భావన ఎప్పుడూ లేదు. వాళ్లకు స్వేచ్ఛనిచ్చాం. నచ్చిన విద్యను ఎంచుకోమన్నాం. చిన్నప్పటి నుంచీ సాయి మానస చాలా చురుకు. ఏదైనా ఇట్టే నేర్చుకునేది. పదిలో 93%, ఇంటర్‌ 96% సాధించింది. తన గురించి ఉపాధ్యాయులు గొప్పగా చెబుతోంటే ఆనందమేసేది. నా మాట విని ఇంజినీరింగ్‌ చదవడమే కాదు, కళాశాల టాపర్‌గా నిలిచింది. వాళ్ల నాన్న చేస్తున్న సేవలను చూసి అలా తనూ సమాజానికి ఏదైనా చేయాలనుకుంది. అందుకు సివిల్స్‌ సరైన మార్గమని, రాయాలని నిర్ణయించుకుంది. దిల్లీలో శిక్షణా తీసుకుంది. కొవిడ్‌ సమయంలో ఇంట్లోనే సిద్ధమైంది. అమ్మాయిలు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుంటే తప్పక సాధిస్తారని తన నమ్మకం. అది నిరూపించాలనే ఎంతో కష్టపడింది. ఏదైనా సాధించే వరకూ నిద్ర పోదు. అందుకే తన నిర్ణయాలకు అడ్డు చెప్పలేదు. సివిల్స్‌లో తన ర్యాంకు (48) మా నిర్ణయం సరైనదే అనడానికి రుజువు.

-భరణీదేవి, సాయిమానస తల్లి

నాన్నకు కొత్త ఊపిరి...

సంజన, షాను

హైదరాబాద్‌కు చెందిన ఐటీ ఉద్యోగిని సంజన.. కొవిడ్‌ సమయంలో తండ్రితో కలిసి ఎంతోమంది రోగులకు అండగా నిలిచింది. సంజన తండ్రి మనోజ్‌ రహేజా రాణిగంజ్‌లో పైపుల వ్యాపారి. పేద, మధ్యతరగతి వారు ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ అందక విలవిల్లాడుతుంటే తండ్రీకూతుళ్లు దాతల సాయంతో ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, వెంటిలేటర్లు ఉచితంగా అందజేశారు. వాళ్ల సేవ గురించి పొరుగు రాష్ట్రాలకూ తెలిసింది. ఈ క్రమంలోనే ఈ జూన్‌ 6న బిహార్‌లోని భగల్‌పూర్‌కు చెందిన షానుకుమారి సంజనకి ఫోన్‌ చేసింది. తన తండ్రి జైప్రకాష్‌ (52)కి కాలేయం పాడైందనీ, మార్పిడికి అవసరమైన డబ్బు తన దగ్గర లేదన్నది ఆ కాల్‌ సారాంశం. షాను కుటుంబం తండ్రిని బతికించుకోవడం కోసం ఉన్నదంతా ఖర్చుపెట్టారు. ఇక చేయడానికి లేక ఇంట్లోనే చికిత్స అందిస్తున్నారు. అది విని చలించిపోయిన సంజన అతనికి ఎలాగైనా కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేయించాలని సంకల్పించింది. విమాన చార్జీలు చెల్లించి జైప్రకాష్‌ని నగరానికి రప్పించింది. డాక్టర్లతో మాట్లాడితే శస్త్రచికిత్సకు రూ.23 లక్షలు అవుతాయన్నారు. ఈ విషయాన్ని సంజన సోనూసూద్‌ ఫౌండేషన్‌కు వివరించింది. బంధువులు, స్నేహితుల వద్దనుంచి వీలైనంత నగదు సేకరించి మిగిలిన సొమ్ముని ఫౌండేషన్‌ నుంచి తీసుకుంది. షానుకుమారి సోదరుడు జైషా నాన్నకు తన కాలేయ దానం చేయడంతో శస్త్రచికిత్స విజయవంతం అయ్యింది. అలా సంజన, షాను చూపించిన చొరవ ఒక తండ్రి ప్రాణాన్ని కాపాడింది. ఈ కూతుళ్లను చూసి వాళ్ల అమ్మానాన్నలు ఉప్పొంగిపోతున్నారు.

ఒకేసారి ఏడు ఉద్యోగాలు...

గొర్రెలను మేపుకొంటూ, వర్షాధార సాగుతో జీవనం సాగించే పేద రైతు బిడ్డ బిందు ఒకటీ రెండు కాదు ఏడు ఉద్యోగాల్ని సాధించింది. అమ్మానాన్నల్ని పుత్రికోత్సాహంతో నింపేసింది.

బిందు ప్రియ

చిత్తూరు జిల్లాలోని అయ్యవారిపల్లె వెంకటరమణ, నాగమణి దంపతులది. వీళ్ల అమ్మాయే బిందు. తరువాత బాబు. ఊర్లో చదువుకోవడానికి పెద్దగా అవకాశాలు లేవు. బిడ్డను బాగా చదివించాలన్న తపనతో బంధువుల సాయంతో కలకడ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు అమ్మానాన్నలు. 8 వరకు కలికిరిలో చదివించారు. నాగమణి సోదరి చంద్రకళ హైదరాబాద్‌లో ఉద్యోగి. ఆమె సాయంతో అక్కడే పై చదువులు చదివించారు. ఇన్ని కష్టాలు పడి చదివిస్తున్న అమ్మానాన్నల నమ్మకాన్ని వమ్ముకానీయలేదు బిందు. హైదరాబాద్‌లోని రుషి ఎమ్మెస్‌ మహిళా ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ చేసింది. అసాధారణ ప్రతిభతో మూడు నెలల వ్యవధిలో ఏడు ప్రముఖ ఐటీ కంపెనీల ఉద్యోగ అవకాశాల్ని అందుకుంది. టీసీఎస్‌, హర్మాన్‌ కార్డన్‌, టాటా గ్రూప్స్‌, సొసైటీ జనరల్‌, స్కిల్‌డ్రైవ్‌, సింటెల్‌, ఎల్వీసొల్యూషన్స్‌ వంటి సంస్థలు ఆమెకు అవకాశాలిచ్చాయి. తను ఫ్రాన్స్‌కు చెందిన సొసైటీ జనరల్‌ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా చేరింది. ఇప్పుడా అమ్మానాన్నల ఆనందానికి అవధుల్లేవు. ‘ఇన్నాళ్లకు మా కష్టాలు తీరనున్నాయని’ తల్లి నాగమణి అంటుంటే... ‘నా ఊపిరి, భవిష్యత్తు అమ్మానాన్నలే. ఎంతో కష్టపడి వ్యవసాయం చేసి గొర్రెలు మేపి నన్ను చదివించారు. ఉన్నత స్థానానికి ఎదిగి మా అమ్మానాన్నల్ని బాగా చూసుకోవడం, తమ్ముణ్ని వృద్ధిలోకి తేవడం నా లక్ష్యాలు’ అంటోంది బిందుప్రియ.

మంచి పేరు తెచ్చుకోమంటే.. గర్వపడేలా చేసింది...

తల్లితో శ్రీజ

మా స్వస్థలం వరంగల్‌. హైదరాబాద్‌లో స్థిరపడ్డాం. నేను జనగాం పీహెచ్‌సీలో స్టాఫ్‌నర్స్‌గా చేస్తున్నా. శ్రీజ చదువంతా ఇక్కడే సాగింది. ఉస్మానియా మెడికల్‌ కాలేజ్‌ నుంచి ఎంబీబీఎస్‌ చేసింది. మావారు పొలిశెట్టి శ్రీనివాస్‌, సీనియర్‌ సేల్స్‌ మేనేజర్‌. ఆయనకి శ్రీజ సివిల్స్‌ రాయాలనుండేది. ఎంబీబీఎస్‌ అయ్యాక సివిల్స్‌పై దృష్టిపెట్టింది. మాకో అబ్బాయి, బీబీఏ చేశాడు. ఇంట్లో ఎప్పుడూ అమ్మాయి, అబ్బాయన్న తేడా చూపించలేదు. అమ్మాయిలను స్వేచ్ఛగా, ధైర్యంగా ఉండేలా పెంచాలన్నది నా అభిప్రాయం. అందుకే మేం తల్లీకూతుళ్లలా కాకుండా స్నేహితుల్లా ఉంటాం. తను చాలా యాక్టివ్‌. తన పనులన్నీ తనే చక్కబెట్టుకుంటుంది. పాటలూ చాలా బాగా పాడుతుంది. సంగీతమూ నేర్చుకుంది. పండుగలంటే చాలా ఇష్టం. ఆరోజు ఇంకా ఉత్సాహంగా ఉంటుంది, పనుల్లో సాయం చేస్తుంది. ఏది చేసినా ‘ఇది చేద్దామనుకుంటున్నా.. ఇలా చేద్దామనుకుంటున్నా.. ఏమంటావమ్మా?’ అని సలహా అడుగుతుంది. ఇలా అన్ని విషయాలూ చర్చించుకుంటాం. ‘అమ్మాయిలకి చదువు, ఉద్యోగం చాలా ముఖ్యం. ఒకరి ఆధారం లేకుండా నీ అంతట నువ్వు ముందుకు సాగడానికి ఇవి సాయపడతాయి. నీ పక్కన ఎవరూ లేకపోయినా నిన్నవి నిల్చోబెడతాయ’ని చిన్నప్పటి నుంచీ తనకు చెప్పేదాన్ని. తను బాగా చదివి, అందరూ మెచ్చుకుంటుంటే చూడాలన్నది నా ఆశ. తనేమో.. సివిల్స్‌లో ఏకంగా అఖిల భారత స్థాయిలో 20వ ర్యాంకు, తెలుగు రాష్ట్రాల్లో మొదటి స్థానంలో నిలిచి మేం గర్వపడేలా చేసింది. తనను సివిల్‌ సర్వెంట్‌గా చూడాలన్న వాళ్ల నాన్న కోరిక తీర్చడంతోపాటు.. నేను చెప్పినట్టే తన కాళ్ల మీద తాను నిలబడటమే కాకుండా మహిళా సాధికారత కోసం కృషి చేస్తానంటోంది. మాకు అంతకు మించిన ఆనందమేముంటుంది?

- లతా పొలిశెట్టి, శ్రీజ తల్లి...

ఐదుగురూ... ఐదుగురే!

ఐదుగురు కూతుళ్లతో సుందరరావు,సావిత్రమ్మ దంపతులు

ఒక్క అమ్మాయి పుడితేనే... బాధపడే వాళ్లున్నారు.కానీ ఈ ఐదుగురు అక్కాచెల్లెళ్లు సాధించిన విజయం చూస్తే... కూతుళ్లే కావాలని అనుకుంటారు...

శ్రీకాకుళం విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుడు పి.సుందరరరావు, విశ్రాంత పబ్లిక్‌హెల్త్‌ నర్స్‌ సావిత్రమ్మ దంపతులకు ఐదుగురు ఆడపిల్లలు. ఐదుగురికీ చిన్నప్పటి నుంచీ క్రీడల్లో తర్ఫీదునిస్తూ, చదువుల్లోనూ ప్రోత్సహించారు. ఆ పిల్లలూ ఒకళ్లతో ఒకళ్లు పోటీపడి అందరూ సర్కారు కొలువులు సాధించి ఉన్నత స్థానాల్లో స్థిరపడటం విశేషం. మొదటి అమ్మాయి పి.ఇందిరామణి శ్రీకాకుళం నగరంలోని వరం పురపాలక ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు. రెండో అమ్మాయి సరళకుమారి హైదరాబాద్‌లో హిందుస్థాన్‌ ఏరోనాటికల్‌ లిమిటెడ్‌లో సీనియర్ ఇంజినీర్‌. మూడో కుమార్తె డా.పి.సుజాత శ్రీకాకుళం బందరువానిపేట జెడ్పీ హైస్కూల్‌ హెచ్‌ఎం. నాలుగో కూతురు పి.సునేత్రి బొబ్బిలి సీబీఎం ఎయిడెడ్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌. ఐదో కుమార్తె పి.సురేఖ శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో మేథ్స్‌ సీనియర్‌ లెక్చరర్‌. ఒక్క రూపాయి కూడా కట్నం ఇవ్వకుండా పెళ్లిళ్లు చేశారా దంపతులు. వీళ్ల అభ్యున్నతిని చూశాక ఎవరైనా ఆడపిల్లా అని పెదవి విరవగలరా.

ఇదీ చదవండి : ఇవి తింటే.. మహిళల ఆరోగ్యానికి ఎంతో మేలు!

ABOUT THE AUTHOR

...view details