Current bills To increase in Telangana: వచ్చే ఏప్రిల్ నుంచి ఇంటి కరెంటు బిల్లు కూడా నెలనెలా పెరగనుంది. ఇలా ఛార్జీలు పెంచడానికి ‘విద్యుత్ పంపిణీ సంస్థ’లు ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేకుండా స్వేచ్ఛాయుత అధికారమిస్తూ ఈఆర్‌సీ ముసాయిదా ఉత్తర్వులు జారీచేసింది. కేంద్ర విద్యుత్‌శాఖ జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం ‘రాష్ట్ర విద్యుత్ నియంత్రణ రెండో సవరణ ఉత్తర్వు పేరుతో దీనిని జారీ చేస్తున్నట్లు తెలిపింది.
ఈఆర్‌సీ గతంలో జారీచేసిన కరెంటు ఛార్జీల సవరణ మార్గదర్శకాలకు రెండోసారి తాజాగా సవరణ చేసినట్లు వివరించింది. ‘ఇంధన ఛార్జీల సర్దుబాటు - ఎఫ్‌సీఏను ఇంతకాలం ఏడాదికోసారి ప్రజలపై మోపి బిల్లుల రూపంలో డిస్కంలు వసూలు చేస్తున్నాయి. దీనివల్ల ప్రజలపై ఆర్థిక భారం అధికంగా పడుతోందని.. ఇలా కాకుండా నెలనెలా కరెంటు ఛార్జీలను సవరించాలని కేంద్రం ఇటీవల రాష్ట్రాలను ఆదేశించింది. ఇది అమల్లోకి రావాలంటే రాష్ట్ర ఈఆర్‌సీ సవరణ ఉత్తర్వులు జారీచేయాల్సి ఉన్నందున ఇది ఇస్తున్నట్లు కమిషన్ ఛైర్మన్ శ్రీరంగారావు తెలిపారు.
చలనఛార్జీలను పెంచితే కరెంట్ బిల్లు పెరుగుదల: ప్రజలకు సరఫరా చేసే కరెంటును పలు విద్యుత్ కేంద్రాలు భారత ఇంధన ఎక్స్ఛేంజీ నుంచి రోజూవారీగా కొనుగోలు చేస్తాయి. ఒక విద్యుత్ కేంద్రం నుంచి ఎంత కొనాలనే ఒప్పందాన్ని డిస్కంలు ముందే చేసుకుంటాయి. దాని ప్రకారం ప్రతీ యూనిట్ కరెంటుకు స్థిరఛార్జి, చలనఛార్జి కలిపి చెల్లించాలి. చలనఛార్జి అంటే ఒక థర్మల్ విద్యుత్ కేంద్రంలో కరెంటు ఉత్పత్తికి అవసరమైన బొగ్గు, పెట్రోలు, డీజిల్, ఇతర ముడిసరకుల కొనుగోలు, అక్కడి ఉద్యోగుల జీతభత్యాలు ఇలా అన్నింటికీ కలిపి చెల్లించే డబ్బు. ఈ ఖర్చునుబట్టి యూనిట్‌కు సగటున విధించే మొత్తాన్ని విద్యుత్ కేంద్రం నిర్ణయిస్తుంది. చలనఛార్జీ పెరిగేకొద్దీ ఎఫ్‌సీఏ రూపంలో కరెంటు బిల్లుల ద్వారా ప్రజల నుంచి నెలనెలా యూనిట్‌కు 30 పైసల వరకూ గరిష్ఠంగా పెంచి వసూలు చేసుకోవచ్చని ఈఆర్‌సీ సూచించింది. ఒకవేళ పెంపు యూనిట్‌కు 30 పైసలకు మించితే మాత్రం ముందుగా కమిషన్ నుంచి అనుమతి తీసుకోవాలని తెలిపింది.