కృష్ణా జిల్లాలో...
నందిగామలోని జీడీఎంఎం ఇంజినీరింగ్ కాలేజీలో కరోనా నియంత్రణపై పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానిక డీఎస్పీ నాగేశ్వర్ రెడ్డి, సీఐ కనకారావు హాజరయ్యారు. వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైనందున అందరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని డీఎస్పీ కోరారు.
ప్రకాశం జిల్లాలో...
గిద్దలూరు పట్టణంలో మాస్కులు ధరించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న వాహనదారులకు పోలీసులు అపరాధ రుసుములు విధించారు. పాదచారులు సైతం మాస్కులు ధరించాలని స్పష్టం చేశారు. కరోనా ఉద్ధృతి మళ్లీ పెరుగుతున్నందున భౌతిక దూరం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అనంతపురం జిల్లాలో...
ప్రజలు మాస్కులు ధరించాలంటూ.. అనంతపురం పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. మాస్కు ధరించి వెళ్తున్న వాహనదారులకు గులాబీ పూలు ఇచ్చి అభినందించారు. మాస్కు ధరించని వారికి జరిమానా విధించి హెచ్చరిస్తున్నారు.
నెల్లూరు జిల్లాలో...
ఆత్మకూరులో 3 రోజులుగా.. కరోనాపై పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ.. మాస్కు ధరించకుండా వెళ్తున్న వారిని ఆపి ఆత్మకూరు డీఎస్పీ వెంకటేశ్వరరావు స్వయంగా మాస్కులు పంపిణీ చేశారు. రేపటి నుంచి కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. లేదా భారీ జరిమానా విధిస్తామన్నారు.
కడప జిల్లాలో...
రెండో విడత కరోనా వ్యాపిస్తున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ విజ్ఞప్తి చేశారు. జిల్లావ్యాప్తంగా మాస్కులు ధరించకుండా తిరుగుతున్న వాహనదారులకు, పాదచారులకు.. అవగాహన కల్పించారు. మాస్కులు పంపిణీ చేశారు. ఇకపై మాస్కులు లేకుండా బయటకు వస్తే కేసు, జరిమానా తప్పదని హెచ్చరించారు.
విజయనగరం జిల్లాలో...
పార్వతీపురం ప్రధాన కూడలి వద్ద పోలీసులు కరోనాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీఎస్పీ సుభాష్ మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు.
ఇదీ చదవండి:
ఆగస్టు 15న విలేజ్ క్లినిక్లు ప్రారంభించాలి: సీఎం జగన్