Cockfights in AP : రాష్ట్రవ్యాప్తంగా కోళ్లు కత్తులు దూశాయి. కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో విచ్చలవిడిగా కోడిపందేలు సాగాయి. వైసీపీ నాయకులే దగ్గరుండి పందేలను ప్రోత్సహించడం.. పోలీసుల మీదే కేకలు వేస్తూ పెత్తనం చెలాయించడంతో మిగిలినవారూ లెక్కచేయని పరిస్థితి. కోనసీమ జిల్లా రావులపాలెం మండలం వెదురేశ్వరం రోడ్డులో కొత్తపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి పోలీసులపై ఆగ్రహం వ్యక్తంచేయడం చర్చనీయాంశమైంది. అమలాపురం మండలం వన్నెచింతపూడిలో జగనన్న లేఅవుట్‌లో కోడిపందేల బరిని అధికార పక్షం నాయకులు ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి, గోకవరంలో ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కోడిపందేలు ప్రారంభించారు. ఆయా వేదికలవద్ద రూ.లక్షల్లో పందేలు సాగాయి. తాళ్లరేవు మండలంలో జార్జిపేటలో రాష్ట్ర స్థాయి బరి ఏర్పాటు చేశారు. మంత్రి విశ్వరూప్ కుమారుడు పందేలను వీక్షించారు. ఒక్కో పందెం రూ.6 లక్షలతో మొదలైంది. ఇక్కడ గుండాటను పోలీసులు అడ్డుకున్నా.. కోడిపందేలు ఆగలేదు.
చేతులు మారిన కోట్ల రూపాయలు : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం సీసలిలో లెక్కింపు యంత్రాల ద్వారా పందేల నగదు లావాదేవీలు సాగాయి. భీమవరం మండలం డేగాపురం, ఆకివీడు మండలం దుంపగడపలో శుక్రవారం దాకా కబడ్డీ పోటీలు జరిపితే.. అదే ప్రాంగణం కోడి పందేలకు వేదికైంది. నిడమర్రు, సీసలి, డేగాపురంలో డిజిటల్ స్క్రీన్లలో పందేలు వీక్షించే ఏర్పాట్లు చేశారు. ఒక్కో పందేనికి బరిలో 10 లక్షల రూపాయలు బయట 50 లక్షల రూపాయల దాకా బెట్టింగులు సాగాయి. ఒక్కో బరిలో రూ.కోటి వరకు చేతులు మారాయి. పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు కిక్కిరిశాయి. కైకలూరు మండలం చటాకాయ్ గ్రామంలో కోడిపందేల బరిలో రెండు కోళ్లూ నెగ్గినట్లు ప్రకటించడంతో వివాదం తలెత్తింది. తాడేపల్లిగూడెంలో పందేల దగ్గర జరిగిన తోపులాటలో ఒకరి కాలు విరిగింది. నిడమర్రు మండలంలోని మందలపర్రులో ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. కాళ్ల మండలం సీసలి బరిలో ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు దగ్గరుండి పందేలు నిర్వహించారు. బుట్టాయగూడెం మండలం దుద్దుకూరులో ఎమ్మెల్యే తెల్లం బాలరాజు గిరిజనుల సంప్రదాయ కోడి పందేలను ప్రారంభించారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో భోగి రోజు వేసిన పందేలు, జూదాలు అన్నీ కలిపి దాదాపు రూ.400 కోట్లు చేతులు మారినట్లు తెలుస్తోంది.
25 ఎకరాల్లో బరి: కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోనూ కోడి పందేలు యథేచ్ఛగా సాగాయి. రెండు జిల్లాల్లో 100కు పైగా బరులను ఏర్పాటు చేశారు. అధికార వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులు, నేతల కనుసన్నల్లో వీటిని నిర్వహిస్తున్నారు. గన్నవరంలో అధికార పార్టీ నేతల కనుసన్నల్లో పందేలు సాగాయి. ప్రధానంగా అంపాపురంలో 25 ఎకరాల్లో అతి పెద్ద బరి ఏర్పాటైంది. కోడి పందేలతోపాటు జూదం విచ్చలవిడిగా జరిగింది. పెనమలూరు నియోజకవర్గంలోని ఈడుపుగల్లులో వైసీపీ నేతల కనుసన్నల్లో 30 ఎకరాల్లో బరిని సిద్ధం చేశారు. ఇక్కడ జూద శిబిరాలూ వెలిశాయి. గుడివాడ నియోజకవర్గం పరిధిలో 15కుపైగా బరులున్నాయి. లింగవరం కె.కన్వెన్షన్ ప్రాంతం, బైపాస్‌రోడ్డు, పామర్రు-కత్తిపూడి జాతీయ రహదారిని ఆనుకుని మల్లాయపాలెం పంచాయతీ పరిధిలో, బందరు రోడ్డులో బొమ్ములూరు మలుపువద్ద, నందివాడ, గుడ్లవల్లేరు ప్రాంతాల్లో శిబిరాల్ని సిద్ధం చేశారు. గుడ్లవల్లేరులోని వేమవరం బరివద్ద 3, 5 పందాలు వరుసగా గెలిస్తే బుల్లెట్, స్కూటీలను బహుమతులుగా ఇస్తున్నారు.
సీసీ కెమెరాల కనుసన్నల్లో : ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం మల్లేల సమీపంలోని మామిడి తోటలో కోడి పందేల బరి ఏర్పాటు చేశారు. దీనికి పక్కనే తోటల్లో గుడారాలు పెట్టి క్యాసినో నిర్వాహకులను తీసుకొచ్చి జూద క్రీడను ఆడిస్తున్నారు. లోపలికి ఎవరూ వెళ్లకుండా గట్టి కాపలా పెట్టారు. ప్రవేశ రుసుమే 15వేల రూపాయలుగా నిర్ణయించారు. భోజనానికి మరో 2వేలు రూపాయలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. అధికార పార్టీకి చెందిన నాయకుడి కనుసన్నల్లోనే ఈ క్యాసినో నిర్వహిస్తున్నారు. పర్యవేక్షణకు సీసీ కెమెరాలను అమర్చారు. బౌన్సర్లతో పాటు ప్రైవేటు సైన్యం కాపలాగా ఉంది. గురువారం రాత్రి వరకూ మల్లేలలోని హడావుడి చేసిన పోలీసులు శనివారం కనిపించలేదు.