ఆధార్ ఉంటే చాలు... అక్కడ వైద్యం ఉచితం ఒకప్పుడు ప్రభుత్వ వైద్యశాలలంటే అరకొర వసతులు, వైద్య సేవలు అనే భావన ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. అయితే అందుకు భిన్నంగా ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు పని చేస్తున్నాయి. రోగులకు సేవలు అందించడంలో ముందుంటున్నాయి. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 36 ఆరోగ్య కేంద్రాలు ఉండగా అందులో 26 కేంద్రాలు విజయవాడ నగరంలోనే ఉన్నాయి. అన్ని రోజులు పనిచేసే ఈ ఆరోగ్య కేంద్రాల్లో ఓపీ సంఖ్య రోజురోజుకీ గణనీయంగా పుంజుకుంటోంది. ఒక్కో ఆరోగ్య కేంద్రంలో రోజుకు సరాసరి 80 నుంచి 120 మంది ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటున్నారు.
కేవలం ఆధార్ కార్డు తీసుకువస్తే చాలు ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల్లో అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తారు. క్లిష్టతరమైన సమస్యలు ఉంటే నిపుణులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా రోగులే నేరుగా మాట్లాడి వారి సమస్యలు చెప్పుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. నిపుణుల సలహాలను బట్టి సంబంధిత రోగులను సమీపంలోని పెద్దాసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయిస్తున్నారు.
సాంకేతికత వినియోగం
ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ ఆరోగ్య కేంద్రాలు పని చేస్తాయి. ఒక్కో ఆరోగ్య కేంద్రంలో ఆరుగురు సిబ్బంది సేవలు అందిస్తారు. స్వయంగా ఎంబీబీఎస్ వైద్యులే ఇక్కడ రోగులకు సేవలు అందించడం ప్రత్యేకత. వైద్యుడిని కలిశాక ఆధార్ సహాయంతోనే నేరుగా ఫార్మసీకి రోగి సమస్య, మందుల వివరాలు చేరిపోతాయి. రోగి ఫొటో, వారికి కేటాయించే నంబర్ ఆధారంగా మందులు అందిస్తారు.
నిరంతర పర్యవేక్షణ
ఈ ఆరోగ్య కేంద్రాలను ఎప్పటికప్పుడు జిల్లా సహాయక మేనేజర్ తనిఖీ చేస్తుంటారు. ఆరోగ్య కేంద్రంలో ఉన్న సిబ్బంది పనివేళలు, ఫార్మసీలో ఉన్న మందులు అవి కాలం చెల్లినవా, కాదా అని పరిశీలించి ఎప్పటికప్పుడు రికార్డులు రూపొందిస్తుంటారు. దీంతో ఆరోగ్య కేంద్రాల పని తీరు క్రమంగా మెరుగుపడుతూ వస్తోంది.
ఆయుష్మాన్ భారత్లో భాగంగా..
ఆయుష్మాన్ భారత్ లో భాగంగా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు పేదల పాలిట వరప్రదాయినిగా నిలుస్తున్నాయి. మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు పైసా ఖర్చు లేకుండా మందులు ఉచితంగా ఇవ్వడంపై రోగులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.