CJI NV Ramana at Ponnavaram: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్‌వీ రమణ తన స్వగ్రామం కృష్ణా జిల్లా పొన్నవరం చేరుకున్నారు. సీజేఐ హోదాలో తొలిసారిగా గ్రామానికి వచ్చిన సీజేఐకు గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. జస్టిస్ ఎన్‌వీ రమణ దంపతులను ఎడ్లబండిపై ఊరేగింపుగా గ్రామంలోకి తీసుకెళ్లారు. మేళతాళాలు, జనసందోహం నడుమ సీజేఐను గ్రామంలోకి ఆహ్వానించారు.
అనంతరం పొన్నవరంలోని శివాలయంలో ఆయన ప్రత్యేక పూజులు నిర్వహించారు. అనంతరం గ్రామస్థుల పౌరసన్మానాన్ని జస్టిస్ ఎన్‌వీ రమణ దంపతులు స్వీకరించనున్నారు. గ్రామంలో ఆయన నాలుగు గంటలపాటు గడపనున్నారు. సీజేఐ పర్యటన నేపథ్యంలో పొన్నవరంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
మేళతాళాలతో స్వాగతం..
CJI NV RAMANA AP TOUR NEWS: సీజేఐగా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా స్వగ్రామం వస్తున్న జస్టిస్ ఎన్వీ రమణకు ఘన స్వాగతం లభించింది. సీజేఐ హైదరాబాద్ నుంచి రాష్ట్ర సరిహద్దు గరికపాడు చెక్‌పోస్టు వద్దకు చేరుకోగానే కృష్ణా జిల్లా యంత్రాంగం మేళతాళాలతో స్వాగతం పలికింది. జిల్లా కలెక్టర్ నివాస్, పలువురు మహిళలు.. ఆయకు ఆహ్వానం పలికి పుష్పగుచ్ఛాలు అందజేశారు. వేదపండితులు పూర్ణకుంభంతో, మేళతాళాల నడుమ స్వాగతం పలికారు. మహిళలు జాతీయజెండా చేతబూని.. ఎన్వీ రమణకు అభివాదం తెలిపారు.