విదేశీ విద్య, పెళ్లి కానుక తదితర పథకాలన్నీ జగన్ ప్రభుత్వం రద్దు చేసిందని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. మహాత్మా జ్యోతిరావు పూలే 130వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నివాళులు అర్పించారు. వైకాపా ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను మూసేసి.. పేదల పొట్ట కొట్టిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఇసుక మాఫియా దోపిడితో.. లక్షలాది మంది జీవనోపాధి కోల్పోయి, ఆత్మహత్య చేసుకునే దుస్థితి తెచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
బీసీలకు వైకాపా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆయన పిలుపునిచ్చారు. బీసీల హక్కులు, పూలే ఆశయాల సాధనకు కృషి చేయాలని కోరారు. జ్యోతిరావు పూలే, మహాత్మాగాంధీ, బీఆర్ అంబేడ్కర్ ఆశయాల సాధన కోసమే.. ఎన్టీఆర్ తెదేపాను స్థాపించారని గుర్తు చేశారు. పార్టీకి బీసీలు ఉండగా ఉంటున్నారని ప్రభుత్వానికి అక్కసు అని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించారని ఆగ్రహించారు.